హరిత దీపావళి చేసుకుందాం..ఆనందంగా ఉందాం

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 09:27 AM IST
హరిత దీపావళి చేసుకుందాం..ఆనందంగా ఉందాం

Updated On : October 22, 2019 / 9:27 AM IST

పండుగలన్నీ ప్రస్తుతం ట్రెండ్లీగా మారిపోయాయి. పండుగ ఏదైనా సరే పర్యావరణానికి హానికానిదిగా ఉండాలి. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే పర్యావరణానికి హాని చేసేది మారిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలతో క్రాకర్స్ కాల్చటం. ఘాటైన రసాయినిక పదార్ధాలతో తయారు చేసిన టపాసులను కాల్చటంతో పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోంది. శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యంతో దీపావళి పండుగ మారిపోయింది. కానీ ఇప్పటికైనా పర్యావరణానికి హాని కలుగని హరిత దీపావళిని చేసుకుందాం. అది ఎలాగో తెలుసుకుందాం..

దీపావళికి విద్యుత్ దీపాలలో అలంకరణ వద్దు..మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించండి. అలా చేస్తే..అందానికి అందం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఆనందమేకదా. మనస్సుకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. 

దీపావళి అంటే దీపాలు తరువాత టపాసులు. టపాసులు అంటే ఇప్పుడు ఎన్నో రకాల స్వదేశీ..విదేశీ టపాసులు తారాజువ్వల్లా దూసుకు వచ్చేశాయి. వీటితో పర్యావరణానికి హాని కలుగుతోంది. పర్యావరణానికి హాని కలుగని టపాసులు కూడా ఉన్నాయి. రాబోయే తరాలకు హరిత దీపావళి గురించి తెలియజేయాలి. అలా    చేయాలి అంటే ముందు మనం ఆచరించి చూపించాలి. అలా చేస్తే మనల్ని చూసి పిల్లలు కూడా పాటిస్తారు. వారికి మంచి చెడులు తెలియజేయాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తించాలి. 

పండుగ అంటే ఇంటిలోనే ఉండిపోవటం కాదు.చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ఒకచోట చేర్చి..వారికి హరిత దీపావళి ఎలా చేసుకోవాలో నేర్పాలి. దాని కోసం పిల్లల్ని చెట్ల నుంచి రాలిపోయిన ఎండిన ఆకులు, చిన్న చిన్న పుల్లల్ని ఏరుకు రమ్మనాలి. ఖాళీగా ఉన్న చోట వాటిని కుప్పగా పోసి..వెలిగించి చక్కగా దాని చుట్టూ చేరి పిల్లలంతా ఆడుతూ పాడుతూ ఉండేలా ప్లాన్ చేయండి.పిల్లలంతా ఒకచోట చేరితే ఎంత బాగుంటుందో కదూ. కేరింతల సందడి సందడిగా మారిపోతుంది. అందరికీ చక్కగా మిఠాయిలు పంచుకుని తినొచ్చు. రంగు రంగుల బెలూన్లు తెచ్చి వాటి నిండా మెరుపులు, చిన్న చిన్న రంగు పేపర్లు వేసి ఊది పగలకొట్టాలి. కొన్ని రకాల ఆకులను చేతిపై పెట్టుకుని కొడితే పెద్ద సౌండ్ వస్తుంది. వాటిని గ్రీన్ కాకర్స్ అని పిల్లలకు చెప్పాలి.  

రంగవల్లికలతో హరిత దీపావళి 
ముగ్గులంటే ఇప్పుడంతా రంగులతో వేసినవే గుర్తుకొస్తాయి. అవి అందం..అలంకరణే తప్ప వేరే ఏమీ లేదు. కానీ  ముగ్గుల మూలం పక్షులకు, చీమలు వంటి వాటికి ఆహారం వేయటమే. ముగ్గులో వరిపిండి కలుపుతారు దాన్ని చీమలు..చిన్న చిన్న పురుగులు తింటాయి. అలా వాటికి ఆహారం పెట్టటం ముగ్గుల పరమార్థం. అంతేకాదు ముగ్గుని చనిపోయిన నత్త గుల్లలను సేకరించి తయారు చేస్తారు. అలా చేసిన ముగ్గుని వాకిలిలో వేస్తే మనకు హాని కలిగించే దోమలు చనిపోతాయి. అలా ముగ్గు ఇంటికి అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదు పసుపు, కుంకుమలతో కూడా ముగ్గులు వేయొచ్చు. పసుపు  యాంటి బయాటిక్ చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది. తాజా పువ్వులతో అందమైన సువాసనలు వెదజల్లే ముగ్గులు వేసుకోవచ్చు. అలా చేస్తే ఇంటికి చక్కటి పండగ కళ వచ్చేస్తుంది. 
డెకరేషన్ కోసం సహజసిద్ధమైన పువ్వులు
ఇంటికి పండుగ శోభను తెచ్చేవి పువ్వులు. రంగు రంగుల్లో ఉండే పువ్వులతో ఇంటిని అలంకరించుకోవచ్చు. గుమ్మాలకు, బంతి, లేదా మల్లె మాలలు, ఇంట్లో చిన్న చిన్న పూల కుండీల్లో గులాబీలు, లిల్లీలు అలంకరించవచ్చు. కృత్రిమమైన విద్యుత్ వెలుగుల కంటే అత్యంత సహజంగా ఉండే పూల  అలంకరణ ఇంటికి పండుగ శోభను తెస్తుంది. 
బట్టలతో డెకరేషన్  
రంగు రంగుల చీరల్ని.. దుపట్టాలు చక్కగా తాడులా మెలిపెట్టి  డెకరేట్ చేసుకోవచ్చు. రంగు రంగుల  పేపర్లతో డిజైన్లుగా కట్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. పాతకాలం నాటి దీపాలు అంటే లాంతర్లు వంటివాటిని వెలిగింది ఇంట్లో వేలాడదీసినా చక్కటి లుక్ వస్తుంది. దీపావళి రోజునైనా..కాలింగ్ బెల్స్ వాడకుండా గుమ్మానికి రెండు వైపులా చక్కగా  రెండు గంటలను వేలాడదీస్తే ఆ సౌండ్ చాలా బాగుంటుంది. గంటల సౌండ్ వినటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. 

దీపావళి రోజు ఇంట్లో సువాసన కోసం ఫ్రెష్ నర్స్ కాకుండా చక్కగా ఆర్గానిక్ సాంబ్రాణి కడ్డీలు, సువాసన కలిగించే పువ్వులు ఉంచితే సువాసనలతో వెలుగులతో దీపావళి ఆనందాలు విరజిమ్ముతుంది.

నేటి మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తుండటంతో పిండి వంటలు చేయటానికి పెద్దగా టైమ్ దొరకటంలేదు. దీంతో మార్కెంట్ నుంచే  స్వీట్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. వాటిలో కృత్రిమ రంగులతో తయారు చేసినవే ఉంటున్నాయి. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కొంచెం ఓపిక చేసుకుని త్వరగా తయారైపోయే స్వీట్లను ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యం తృప్తి కూడా ఉంటుంది. ఇలా ఒకటీ రెండూ కాదు..ఆలోచన ఉంటే ఏదీ అసాధ్యం కాదు. సింపుల్ టిప్స్ తో దీపావళిని టపాకాయలు లేని గ్రీన్ దీపావళిగా చాలా సందడిగా సంబరంగా జరుపుకోవచ్చు. ఇలా హరిత దీపావళి జరుపుకుని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుద్దాం..అందరికీ హరిత దీపావళి శుభాకాంక్షలు.