AC Side Effects: ఏసీకి అలవాటు పడితే అంతే సంగతులు.. ఈ సమస్యలు రావడం ఖాయం

AC Side Effects; ఏసీ గదిలో గాలీ, వాతావరణం తేమ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దుమ్ము, బ్యాక్టీరియా గాల్లోనే తిరుగుతాయి.

AC Side Effects: ఏసీకి అలవాటు పడితే అంతే సంగతులు.. ఈ సమస్యలు రావడం ఖాయం

Health problems caused by excessive use of AC

Updated On : August 17, 2025 / 7:03 PM IST

ప్రస్తుత జనరేషన్ చాలా సుఖమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. శ్రమ లేకుండా పని చేయడానికి ఇష్టపడుతున్నారు. అలంటి సౌకర్యవంతమైనవాటిలో ఏసీ ఒకటి. ఎండాకాలంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇంట్లో, కార్యాలయంలో, వాహనాల్లో ఎయిర్ కండిషనర్ (AC) ఉపయోగిస్తున్నారు. దీని వల్ల రూమ్ అంతా చల్లగా మారి హాయిని ఇస్తుంది. అయితే, ఏసీలు ఉపయోగిచడం వల్ల తాత్కాలికంగా శరీరానికి హాయిగా అనిపించినా, దీర్ఘకాలంగా చూస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం ఉందట. నిపుణులు సైతం ఇదే విషయాన్నీ చెప్తున్నారు. మరి ఏసీ వల్ల కలిగే ఆ ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.శ్వాసకోశ సమస్యలు:
ఏసీ గదిలో గాలీ, వాతావరణం తేమ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దుమ్ము, బ్యాక్టీరియా గాల్లోనే తిరుగుతాయి. అవి శరీరంలోకి వెళ్లడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఆలర్జీలు, నాసికా రుగ్మతలు (సైనసైటిస్), ఆస్తమా తీవ్రమవడం వంటివి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

2.చర్మం ఎండిపోవడం:
ఏసీ గదిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం యొక్క సహజ తేమ క్రమంగా ఆవిరైపోతుంది. దానివల్ల చర్మం పొడిబారడం, అలర్జీలు, చెమట ఎక్కువగా రాకపోవడం, చర్మం పెళుసుగా మారడం వంటివి జరుగుతాయి.

3.శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం:
ఏసీ గదిలో ఎక్కువగా ఉండటం వల్ల శరీరం తక్కువ ఉష్ణోగ్రతకు అలవాటుపడిపోతుంది. బయటికి వెళ్తే, ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుతో శరీరం తట్టుకోలేక పోవచ్చు. ఫలితంగా జలుబు, జ్వరాలు, తలనొప్పి, నీరసం వంటివి రావచ్చు.

4.దాహం తక్కువగా ఉండటం & నీరసం:
AC గదిలో చల్లదనం కారణంగా చెమట పట్టదు. కాబట్టి దాహం తక్కువగా వేస్తుంది. దీనివల్ల నీరసం, తలనొప్పి, మానసిక అలసట, ఉత్సాహం తక్కువగా ఉండటం జరుగుతుంది.

5.కండరాలు, కీళ్ల నొప్పులు:
ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. కొంతమందికి చల్లదనం వల్ల మైక్రో కండరాలు, జాయింట్ స్టిఫ్‌నెస్ వచ్చే అవకాశం ఉంది.

ఏసీ వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు:

  • తరచూ గదిని వెలుపల గాలిని లోనికి రాణిస్తూ ఉండాలి
  • ఏసీ టెంపరేచర్‌ను 24°C నుంచి 26°C లో ఉండేలా చూసుకోవాలి
  • ఒకటి, రెండు గంటలకొకసారి బయటికి వెళ్లి సహజ గాలిని పీల్చుకోవాలి.
  • చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజర్లు వాడాలి.
  • తరచూ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి

ఏసీ చల్లదనాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగించవచ్చు. కానీ దీర్ఘకాలంగా ఎక్కువసేపు గడిపితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సహజ గాలిని ప్రాధాన్యతనిస్తూ, ఏసీ వినియోగాన్ని మితంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.