భారత్ చేతిలో రష్యా వ్యాక్సిన్ డేటా.. మూడో ట్రయల్ మనదగ్గరే!

Russia shares data on vaccine with India : రష్యా కరోనా వ్యాక్సిన్ డేటా భారత్ చేతికి వచ్చేసింది.. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన రష్యాలోని గమలేయా పరిశోధన సంస్థ తమ డేటాను భారత్‌కు షేర్ చేసింది.. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ మనదేశంలోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్ -V కరోనా వ్యాక్సిన్ పనితీరుపై అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి.
తొలి రెండు దశల్లో 76 మంది హ్యుమన్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నివేదిక వెల్లడించింది. తొలి రెండు దశల ట్రయల్స్ సమగ్ర సమాచారాన్ని రష్యా భారత్‌కు అందించినట్టు సమాచారం.. వ్యాక్సిన్ భద్రత, సమర్థత వంటి అంశాలపై కూడా సమగ్ర సమాచారాన్ని భారత్ సేకరిస్తోంది. వ్యాక్సిన్ భద్రతపై భారత్ నిపుణులు ఆమోదం తెలిపాల్సి ఉంది.. మరోవైపు రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ సౌదీ అరేబియా, బ్రెజిల్, ఫిలిప్పైన్స్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తుది దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ రెడీ అంటూ రష్యా ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తొలి రెండుదశల ట్రయల్ ఫలితాలను బయటకు చెప్పకపోవడంపై అనేక అనుమానాలకు దారితీసింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తీసుకున్నవారి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది.
వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని పేర్కొంది. రష్యాలో ప్రారంభమైన మూడోదశ ట్రయల్‌లో దాదాపు 40వేల మందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే దాదాపు 20దేశాల్లో ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేస్తున్నట్లు ఆగస్టు 11న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తెకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు పుతిన్ ప్రకటించారు. రష్యా రక్షణశాఖ మంత్రి సెర్జీ షొయగు కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రకటించారు.
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎలాంటి దుష్ర్పభావాలు లేదన్నారు. పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. శరీర ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నాని సెర్జీ షొయగు తెలిపారు.