తెలంగాణలో విదేశాలకు వెళ్లని ఆరుగురికి కరోనా పాజిటివ్..

  • Published By: vamsi ,Published On : March 26, 2020 / 03:00 AM IST
తెలంగాణలో విదేశాలకు వెళ్లని ఆరుగురికి కరోనా పాజిటివ్..

Updated On : March 26, 2020 / 3:00 AM IST

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం(25 మార్చి 2020) మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో మూడేళ్ల బాలుడు, మరో మహిళకు కొవిడ్‌ 19 నిర్ధారణ కాగా కరోనా బాధితుల సంఖ్య 41కి చేరుకుంది. రాష్ట్రంలో మూడేళ్ల వయసు బాలుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి.

హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం బాలుడితో సహా ఇటీవల సౌదీఅరేబియాకు వెళ్లి రాగా.. బాలుడిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో బాలుడిని ఐసోలేషన్‌కు తరలించారు. 

మరోవైపు కొద్దిరోజుల క్రితం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి(49)కి కరోనా వచ్చింది. ఆయన భార్యకు(43) వైరస్‌ సోకినట్లు బుధవారం వెల్లడైంది. ఈమెతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండోదశ వైరస్‌ వ్యాప్తిలో ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళలు.

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన ఒక వ్యాపారి కుటుంబంలో ఇలాగే భార్యాభర్తలిద్దరికీ కరోనా రాగా, వారి ద్వారా కుమారుడికి ఇక్కడే సోకింది. అలాగే కొత్తగూడెం డీఎస్పీకి అతని కుమారుడి ద్వారా వచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 41 మంది కరోనా బారిన పడగా.. వారిలో ఆరుగురికి విదేశాలకు వెళ్లకుండానే వచ్చింది.