హైదరాబాద్ ను వెంటాడుతున్న కరోనా భయాలు : గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 9 మంది అనుమానితులు

కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు, ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు అనుమానితులు చేరారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి వరకు 25 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. అయితే 25 మందిలో ఎరికి కూడా కరోనా వైరస్ లేదని నిర్ధారణ అయింది.
అనుమానితుల్లో కరోనా వైరస్ లక్షణాలున్నాయని..చైనా నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో 9 మంది ఆస్పత్రుల్లో చేరారు. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు, ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు చేరారు. 34 మంది అనుమానితులు గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా చెప్పవచ్చు. వీరిలో 25 మందికి మాత్రం కరోనాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు నిర్ధారణ కాలేదు. అయితే అందులో కొంతమందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా ఉన్నట్లు తేలినవారికి మాత్రం ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు 28 మందికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీటికి సంబంధించి నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆరోగ్య శాఖ..ఐసోలేషన్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుల్లో పూర్తిస్థాయిలో ప్లాన్ చేసి ఎవరైనా అనుమానితులు, పాజిటివ్ కేసులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం 9 మంది అనుమానితుల శాంపుల్స్ కలెక్ట్ చేశారు. వైరాలజీ డిపార్ట్ మెంట్ గాంధీ ఆస్పత్రిలోనే ఉంది కాబట్టి ఒక్క శాంపిల్ తీసుకున్న తర్వాత 6 గంటల సమయం పడుతుంది. రిపోర్టు బయట పడుతుంది. ఇవాళ అర్ధరాత్రికి 9 అనుమానితుల రిపోర్టులు బయటికి వచ్చే అవకాశం ఉంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా భారత్ లోని తెలంగాణ రాష్ట్రం కూడా నగరంలోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల కోసం రెండో వార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారు. పది మంది రోగులకు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్య విద్యా శాఖ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాలేదున్నారు. అయినా అప్రమత్తంగా ఉన్నామని రమేశ్‌రెడ్డి తెలిపారు.
చైనా నుంచి రాష్ట్రానికి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహించి అనుమానితులను ఆయా ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. గత నెల 25 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు ఫీవర్ ఆస్పత్రికి 18మంది అనుమానితులు పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల చైనా నుంచి వచ్చినవారు కరోనా వైరస్ నేపథ్యంలో అనుమానంతో మాత్రమే నిర్ధారణ పరీక్షల కోసం ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో కరోనా అనుమానిత కేసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కోన్నారు. మాస్క్‌లతోపాటు డిస్పోజబుల్ డ్రస్సులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, ఈకారణంగా వైద్య సిబ్బందిని తప్ప ఇతరులెవరిని ఆ వార్డులోకి అనుమతించడం లేదని అస్పత్రి అధికారులు చెప్పతున్నారు.
ఇటీవల చైనా నుంచి కేరళ వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. అతని బ్లడ్ శాంపిల్స్ పరీక్షల కోసం పంపారు. పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ నుంచి కేరళకు వచ్చిన ఆ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.