హైదరాబాద్ పాతబస్తీలో వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి

  • Published By: naveen ,Published On : October 14, 2020 / 11:46 AM IST
హైదరాబాద్ పాతబస్తీలో వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి

Updated On : October 14, 2020 / 12:23 PM IST

Hyderabad Rains: హైదరాబాద్ లోని పాతబస్తీని వరద ముంచెత్తింది. ఫలక్‌నుమాలో వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. భారీ వర్షాలకు పాతబస్తీ అతలాకుతలం అయ్యింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ అంజనీ కుమార్ పర్యటించారు. నాలాలను పరిశీలించారు.

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. ఒక పక్కన మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, పాతబస్తీలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా, స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

మరో రెండు రోజులు వర్షాలు:
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9మంది మృతి చెందారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌ మెట్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

వరద సహాయక చర్యలపై కేటీఆర్‌ సమీక్ష
వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులు, మేయర్‌, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని కేటీఆర్ ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు రోజులు సెలవు:
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం రెండు రోజలపాటు సెలవు ప్రకటించింది. 14, 15 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూసేయాలని ఆదేశించింది. అత్యవసరమైతే కానీ బయటకు రావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రజలను కోరారు.

సాయం కోసం జీహెచ్‌ఎంసీ అత్యవసర సేవల నంబర్లు:
అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ- 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌కు సమీపంలో తీవ్ర వాయుగుండం:
కాగా, హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ(అక్టోబర్ 14,2020) తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

3 రోజులు బయటకు రావొద్దు:
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జల దిగ్బంధం అయ్యాయి. దాదాపుగా 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరింది. వీధులు, కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.

నింగి నేలా.. ఏకమైనట్లు వర్ష విలయం:
నింగి నేలా.. ఏకమైనట్లు కురిసిన వర్షం విలయాన్ని సృష్టించింది. కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏకధాటిగా వాన కురుస్తుండటం ప్రళయాన్ని తలపిస్తోంది. హైదరాబాద్ ను వాన ముంచెత్తింది. చాలా కాలనీలు నీట మునిగాయి. రహదారులపై వరద పోటెత్తడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. అక్టోబరు నెలలో ఈస్థాయి వర్షపాతం గత వందేళ్లలో ఇదే రెండో అత్యధిక వర్షపాతమని అధికారులు చెబుతున్నారు. వందలాది కాలనీల్లో నీరు నిలిచిపోయింది. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరద చేరడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరెంటు లేకపోవడంతో చీకట్లో అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

ఆకాశానికి రంధ్రం పడిందా:
ఆకాశానికి రంధ్రం పడిందా అనేలా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్‌ నగరంలో మంగళవారం(అక్టోబర్ 13,2020) సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునేందుకు ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మహానగర వ్యాప్తంగా చాలాచోట్ల 25 సెంటీమీటర్లకు పైనే భారీ వర్షం కురవడంతో కాలనీల్లో వరద పోటెత్తింది. చెరువులు పోటెత్తాయి. ఉస్మాన్‌గంజ్‌, చింతలబస్తీ ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. టోలీచౌకీ నదీం కాలనీ నీట ముంచింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఆటోనగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో వాహనాల నుంచి బయటికి రాలేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు:
జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థ గంటల తరబడి స్తంభించింది. మిర్యాలగూడ-హాలియా మధ్య వంతెన దెబ్బతింది. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల పైకప్పులు కూలిపోయాయి. మేకలు, జీవాలు మృతిచెందాయి. వాయుగుండం తెలంగాణలోకి ప్రవేశించిందని, ఆ ప్రభావంతో బుధవారం(అక్టోబర్ 14,2020) కూడా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వానలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులకు ప్రవాహం భారీగా వస్తోంది. దీంతో నీటి మట్టాలను తగ్గిస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.