మరో రెండు రోజులు : వద్దన్నా పడుతున్న వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వద్దన్నా పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం 257 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయన్నారు.
అత్యధికంగా వరంగల్ జిల్లాలోని పైడిపల్లిలో 86.5 సెం.మీటర్లు, శేరిలింగంపల్లిలో 57.3 సెం.మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నట్టుండి సాయంత్రం మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. చీకటి పడిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. చార్మినార్, కోఠి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మియాపూర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. JNTU పై వంతెన దిగువన భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. నీటిని GHMC, పోలీసు సిబ్బంది మళ్లించారు.
ఇదిలా ఉంటే…పలు జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో డ్యాం అధికారులు క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదలను సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు నిలిపివేశారు.
Read More : శాసనమండలి నిరవధిక వాయిదా