ఆకాశానికి చిల్లు : మరో రెండు రోజుల పాటు వర్షాలు

క్యుములోనింబస్ మేఘాలు ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడినట్లయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి నగరంలో భారీగీ వర్షం పడింది. దీంతో రహధారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పోటెత్తింది. నాలాలు, డ్రైనేజీ కాల్వలు పొంగిపొర్లాయి. నడుంలోతు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరంలో అత్యధికంగా గుడిమల్కాపూర్ ప్రాంతంలో 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రెడ్‌హిల్స్‌లో 13.3… ఖైరతాబాద్‌లో 12.7… మోండామార్కెట్‌లో 10.9 కార్వాన్‌లో 10.4… నాంపల్లి 9.9 ఆసిఫ్‌నగర్ 9.8, శ్రీనగర్ కాలనీ 9.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన నీటిని పారదోలేందుకు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు శ్రమించారు.
ఇదిలా ఉంటే…దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న గోవా, కర్ణాటక, తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడు వల్ల బీహార్, ఇంటీరియర్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తర్ ప్రదేశ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. ఈ ప్రభావం కారణంగా సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం, సెప్టెంబర్ 28వ తేదీ శనివారం చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.