అన్నంత పనీ చేశారు : పార్కులో ప్రేమ జంటకు పెళ్లి

అనుకున్నంతా అయ్యింది.. భయపడినంతా జరిగింది.. హెచ్చరించినట్లే చేసేశారు భజరంగ దళ్ కార్యకర్తలు. పార్కుల్లో కనిపించే లవర్స్ కు పెళ్లి చేస్తాం అంటూ తాళిబొట్లతో తిరిగారు. వీరికి మేడ్చల్ ఏరియాలోని ఓ పార్కులో ఓ జంట కనిపించింది. అంతే ముందూ వెనకా ఆలోచించకుండా వారికి పెళ్లి చేసేశారు కార్యకర్తలు. వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరబాద్ లో కలకలం రేపుతున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా భారీ ఎత్తున భజరంగ్ దళ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. పార్కుల్లో జంటలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే మేడ్చల్ CMR కాలేజీ ఎదురుగా ఉన్న పార్కులో వీరికి ఓ జంట కనిపించింది. వెంటనే వారిని రౌండ్ చేసిన భజరంగ్ దళ్ యాక్టివిస్టులు.. అమ్మాయి మెడలో బలవంతంగా అబ్బాయితో తాళి కట్టించారు. వద్దని వారు ప్రాధేయపడినా వినలేదు. దీన్ని వీడియో కూడా తీశారు.
దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీడియోలోని కార్యకర్తలపై ఆరా తీస్తున్నారు. బలవంతంగా పెళ్లి చేయటంపై నెటిజన్లు కూడా ఆగ్రహంతో ఉన్నారు. వారు పార్కుకు ఎందుకు వచ్చారో.. ఏ కారణంతో అక్కడ ఉన్నారో తెలుసుకోకుండానే ఎలా తాళి కట్టిస్తారని ప్రశ్నిస్తున్నారు.