బాలాపూర్ లడ్డూ..ఎందుకీ ప్రత్యేకత

  • Published By: madhu ,Published On : September 12, 2019 / 01:14 AM IST
బాలాపూర్ లడ్డూ..ఎందుకీ ప్రత్యేకత

Updated On : September 12, 2019 / 1:14 AM IST

బాలాపూర్ లడ్డూ.. దీనికున్న క్రేజే వేరు.. ప్రతి సంవత్సరం లడ్డు ధర, దానిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్న భక్తులు పెరుగుతూనే ఉన్నారు. గత ఏడాది జరిగిన వేలంలో 16 లక్షలకు పైగా చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందంటున్నారు నిర్వాహకులు. వినాయక నిమజ్జనం సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. లడ్డు సొంతం చేసుకున్న వారికి అదృష్టం వరిస్తుందని భక్తుల నమ్మకం. లడ్డూ వేల పాట మొదలైన 17 సంవత్సరాలు స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు ఛాన్స్ కల్పించారు. 

బాలాపూర్‌లో ప్రారంభమైన లడ్డూల వేలం నగరం మొత్తం వ్యాపించింది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాటను ప్రారంభమైంది. మొదట రూ. 450తో ప్రారంభమైన వేలం క్రమంగా వందలు..వేలు..లక్షలకు చేరింది. ఈ లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలు తలతూగుతాయని, పసిడి పంటలు పండుతాయని స్థానికుల విశ్వాసం. లడ్డూను దక్కించుకున్న వారు కూడా ఇదే చెబుతున్నారు. 

బాలాపూర్ లడ్డూను తాపేశ్వరం హనీఫుడ్స్ తయారు చేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేష్‌డికి ఆ దుకాణ యజమాని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గణేష్ నవరాత్రులు ముగిసే వరకు నియమనిష్టలతో ఉంటారు. మద్యం, మాంసాలను ముట్టుకోరు. గణేషునితో పాటు లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. 

వినాయక చవితి ఫస్ట్ డే నుంచే పోటీ పడుతున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు నిర్వాహకులు. నిమజ్జనం రోజు ఉదయం 7 గంటలకు దరఖాస్తులు ముగిస్తరాు. వేలం పాట రూ. 1116తో స్టార్ట్ అవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. లడ్డూ ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్స కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. 

1994 – 1995లో లడ్డును కోలన్ మోహన్ రెడ్డి దక్కించుకోగా.. 1996-1997లో కోలన్ కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నాడు.. 1998లో  కోలన్ మోహన్ రెడ్డి.. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి, 2000లో కల్లెం అంజిరెడ్డి, 2001 రఘునందన్ చారి, 2002లో కందాడ మాధవ రెడ్డి 2003లో చిగిరింత బాల్ రెడ్డి, 2004లో కోలన్ మోహన్ రెడ్డి, 2005లో ఇబ్రహీం శేఖర్, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి, 2007లో రఘునందన్ చారి, 2008లో కోలన్ మోహన్ రెడ్డి, 2009లో సరిత, 2010లో కొడాలి శ్రీధర్ బాబు, 2011లో కోలన్ బ్రదర్స్ సొంతం చేసుకున్నారు.

2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి, 2013లో తీగల కృష్ణారెడ్డి, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి, 2015లో కోలన్ మదన్ మోహన్ రెడ్డి, 2016లో స్కైలాబ్ రెడ్డి, 2017 నాగం తిరుపతిరెడ్డి, 2018లో శ్రీనివాస్ గుప్తా బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. 
Read More : మహా నిమజ్జనం : నిఘా నీడలో హైదరాబాద్