కొత్త లుక్ : లక్డీకపూల్ వద్ద కట్టెల వంతెన

హైదరాబాద్ లక్డీకపూల్ జంక్షన్ దగ్గర GHMC 30 లక్షలతో కట్టెలతో నిర్మించిన వంతెనను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. నగరంలోని జంక్షన్‌ల దగ్గర బల్దియా సుందరీకరణకు పూనుకుంది. అందులో భాగంగానే.. లక్డీకపూల్‌లో కట్టెలతో వంతెనను నిర్మించింది. ఈ వంతెనతో లక్డీకపూల్ జంక్షన్‌కు కొత్త లుక్ వచ్చింది. త్వరలోనే ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్ జంక్షన్‌ల దగ్గర బ్యూటిఫికేషన్ పనులు చేయనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
నగరంలోని పలు ప్రాంతాల్లోని చౌరస్తాలను అధికారులు సుందరీకరిస్తున్నారు. సంగీత్, సుచిత్ర జంక్షన్లకు కొత్త లుక్ తీసుకొచ్చారు. లక్డీకపూల్ ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన కట్టెల వంతెన ప్రజలను ఆకట్టుకొంటోంది. ప్రకృతివనంలా శోభయమానంగా తీర్చిదిద్దారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొద్ది స్థలంలో పటిష్ట పునాదులు తవ్వారు. భూమిలో ఎనిమిది సిమెంట్, కాంక్రీట్లతో పిల్లర్లు వేశారు. పైన బీములు వేసి..కట్టెలతో నిర్మించేలా వంతెన పిల్లర్లు, బీంలు కనిపిస్తాయి. హైదరాబాద్‌లో ఇలాంటి కట్టడాన్ని తొలిసారిగా చూస్తున్నామని..చాలా బాగుందని పలువురు మెచ్చుకుంటున్నారు.