ఈ సిగిరెట్ అమ్మితే జైలుకే: హైదరాబాద్ లో ఫస్ట్ కేసు.. వ్యక్తి అరెస్ట్ 

  • Published By: vamsi ,Published On : September 23, 2019 / 03:44 AM IST
ఈ సిగిరెట్ అమ్మితే జైలుకే: హైదరాబాద్ లో ఫస్ట్ కేసు.. వ్యక్తి అరెస్ట్ 

Updated On : September 23, 2019 / 3:44 AM IST

దేశంలోని ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు వాడకం, దిగుమతి, అమ్మకంను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ఆర్డినెన్స్‌ ను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ- సిగిరేట్లను వాడుతున్న వారిలో 70 శాతం యువతే ఉండటం, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దీనిని తక్షణమే అమలులోకి తీసుకొస్తూ హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అటువంటి అమ్మకాలు జరిపేవాటిపై నిఘా పెట్టారు. ఫలితంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ సిగరెట్స్‌ అమ్ముతున్న వ్యక్తిని అబిడ్స్ లో పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ సిగరెట్స్‌పై తొలి కేసు నమోదు చేశారు.

పాతబస్తీలోని శాలిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ నూర్‌ ఆరిఫ్‌ అలీ ఎంజే మార్కెట్‌లో గుల్నార్స్‌ పర్‌ఫ్యూమ్ పేరుతో ఓ షాపును రన్ చేస్తున్నాడు. ఈ సిగరెట్లను కేంద్రం నిషేధించాక ఎక్కువ రేటుకు వాటిని అమ్ముకుంటున్నాడు. దీంతో షాపుపై రైడ్ చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతనిని అరెస్టు చేసి 35 ఈ-సిగరెట్లు, 68 వివిధ ఫ్లేవర్ల బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత టోబాకో, ఎలక్ట్రానిక్ సిగరేట్లు, వాటిలో ప్రోపైలేన్, గ్లైకోల్, గ్లిసరిన్,వాటర్, నికోటిన్ ఫ్లేవర్లను కలిపి అలీ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్ 20(2) కింద ఆరిఫ్ అలీపై కేసు నమోదు చేశారు పోలీసులు.