క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం : ప్రయాణీకుడిని 8 కిలోమీటర్లు ఈడ్చుకుపోయిన కారు..వ్యక్తి మృతి

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. క్యాబ్ లో ప్రయాణీకుడు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ హడావిడిగా కారును నడిపాడు. అలా ప్రయాణీకుడిని ఈచ్చుకుంటూ వెళ్లిపోవటంతో గాయాలైన సదరు వ్యక్తి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే..శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల్ని ఎక్కించుకున్నాడు. అదే సమయంలో అక్కడకు పోలీసు వెహికల్ వచ్చింది. దీంతో డ్రైవర్ కంగారుపడి హడావిడిగా కారు తీశాడు.అదే సమయానికి యాదయ్య అనే వ్యక్తి కారులో ఎక్కుతున్నాడు. కారు హఠాత్తుగా కదలటంతో యాదయ్య కిందకు దిగుదామనుకున్నాడు. కానీ అతని షర్టు కారులో చిక్కుకుపోయింది. ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ గమనించలేదు. పోలీసుల నుంచి తప్పించుకోవాలనే కంగారులో ఆపకుండా పోనిచ్చాడు. అలా క్యాబ్ 8కిలో మీటర్ల దూరం యాదయ్యను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు.
శంషాబాద్ టోల్ గేట్ సమీపంలో వాహనదారులు ఇది గమనించి పెద్దగా కేకలు వేస్తు క్యాబ్ ను ఆపారు. యాదయ్యకు తీవ్రంగా గాయాలైయ్యాయి. దీంతో క్యాబ్ డ్రైవర్ భయపడ్డాడు. కారు అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనదారులు వెంటనే యాదయ్యను హాస్పిటల్ కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. హాస్పిటల్ తరలించే సమయానికే యాదయ్య చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.