వాటిపైనే చర్చ : గవర్నర్‌ను కలువనున్న కేసీఆర్ !

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ఖరారు కాలేదు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని టాక్. గవర్నర్‌తో భేటీ అయితే కేసీఆర్…ప్రధానంగా 3 అంశాలపై చర్చించనున్నారని సమాచారం. ఈ సమావేశంపై ప్రచారం జరుగుతుండడంతో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందనే మళ్లీ ఊహాగానాలు మిన్నంటాయి. తొలి విడతలో కేసీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీ పదవీ బాధ్యతలు చేపట్టారు. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చని..పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరుతుందని ప్రచారం జరుగుతోంది.
ఫిబ్రవరి 22వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. అంతకంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 18 లేదా ఫిబ్రవరి 20వ తేదీన విస్తరణ చేయాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోంది. సమావేశాలు..విస్తరణ దానిపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించనున్నారని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఉన్న శాసనమండలి సభ్యుల ఎంపిక కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఫిబ్రవరి 18 లేదా 20 తేదీన కేబినెట్ విస్తరణపై క్లారిటీ రావాల్సి ఉంది. కేబినెట్ విస్తరణ జరుగకపోతే…బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెడుతారా ? అనేది చూడాలి.