ఆర్టీసీ సమ్మె : హైపవర్ కమిటీ అవసరం లేదన్న ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని హైకోర్టుకి ఏజీ తెలిపారు.
ఆర్టీసీ సమ్మె అంశం లేబర్ కోర్టు పరిధిలో ఉన్నందున ముగ్గురు జడ్జీల కమిటీ అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. చట్ట ప్రకారం లేబర్ కమిషనర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు బుధవారం(నవంబర్ 13,2019) మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. హైపవర్ కమిటీ అవసరం లేదని ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పడంతో.. ఇప్పుడు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే ఆసక్తి నెలకొంది.
ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో అటు ప్రభుత్వాన్ని కానీ, ఇటు కార్మికులను కానీ తాము ఆదేశించలేమన్న హైకోర్టు… మధ్యేమార్గంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామని.. దీనిపై ప్రభుత్వ నిర్ణయమేంటో తెలపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు సూచనపై ప్రభుత్వం బుధవారం తన నిర్ణయాన్ని తెలిపింది.
ఇంతదాకా వచ్చిన తర్వాత కార్మికులతో మళ్లీ చర్చలకు వెళ్లడం అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కార్మిక శాఖతో జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కార్మిక నేతలు బయటకు వచ్చేశారని, అలాంటపుడు మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం ఉంది.
ఓవైపు.. చర్చలకు ఛాన్సే లేదని ప్రభుత్వం చెబుతుంటే… మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం చర్చలకు ఇప్పటికైనా సిద్ధమేనంటోంది. హైపవర్ కమిటీ నియామకం తమకు సమ్మతమే అన్నారు. కమిటీకి ఓకే చెబితే.. సమ్మె కొనసాగింపు నిర్ణయాన్ని పునరాలోచిస్తామని చెప్పారు.