టీఎస్ఆర్టీసీ సమ్మె : టి.సర్కార్ ప్రకటనపై ఉత్కంఠ

ఆర్టీసీ సమ్మెపై టి.సర్కార్ ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీ నాలుగు గంటలకు పైగా కొనసాగుతోంది. ప్రధానగా ఆర్టీసీ భవిష్యత్, సమ్మె ప్రభావం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులకు తోడు..ప్రజా రవాణ కోసం ప్రైవేటు బస్సులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. సుమారు ఐదు వేలకు పైగా బస్సులను రోడ్ల మీదకు తీసుకొస్తే..సమస్య తీరుతుందని భావిస్తోంది.
ఆర్టీసీ సంస్థల్లో ప్రైవేటు బస్సులకు అనుమతించాలని, 2600 అద్దె బస్సులను తీసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా నియామకాలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త ట్రావెల్స్ బస్సులను గ్రామాల్లోకి తరలిస్తే..సమస్య తీరే అవకాశంపై చర్చిస్తున్నారు. కార్మిక సంఘాల వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీశారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి విమర్శలు గుప్పించారు. సమ్మెను విచ్చిన్నం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోందని, తమ సమస్యలు తీర్చాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై హైకోర్టు మెట్లు ఎక్కింది. ప్రభుత్వం, ప్రజల తరపున న్యాయవాదులు వాదించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వాదనలు జరిగాయి. సమ్మెను తక్షణమే విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది. రెండు గుర్తింపు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 10 వ తేదీకి వాయిదా వేశారు.
Read More : పండుగ కష్టాలు : కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్