పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు: చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారు

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 05:13 AM IST
పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు: చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారు

Updated On : March 24, 2019 / 5:13 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..  ‘తెలంగాణా.. పాకిస్థానా?’ అంటూ తీవ్రవ్యాఖ్యలు పజవన్ చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్‌లో పవన్‌పై కేసు నమోదు చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన సమయంలో కూడా ఏ ఒక్కరిపైనా తెలంగాణ ప్రజలు దాడులు చేయలేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని అన్నారు. 
తెలంగాణ ఏర్పడ్డ అనంతరం కూడా ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని, అన్నదమ్ములవలే ఉంటున్నట్లు గుర్తుచేశారు. కానీ చంద్రబాబు సూచనలతో పవన్‌కళ్యాణ్ ఓట్లకోసం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏ ఆంధ్రావారి భూములు లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్న పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.