రాములమ్మతో లాభమూ లేదు, నష్టమూ లేదు.. పోతే పోనీ.. లైట్ తీసుకున్న కాంగ్రెస్

congress vijayashanti: తెలుగు సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసి, లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయాలూ సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, స్థిరంగా ఒక పార్టీలో ఆమె ఉండరనే టాక్ ఉంది. 1998లో బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రెండు దశాబ్దాల తన పొలిటికల్ కెరీర్‌లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకొచ్చి తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడా ఎక్కువ కాలం ఉండలేదు. అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్నారు.
విజయశాంతి బీజేపీలో చేరతారనే ప్రచారం:
కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ పదవి సంగతేమో కానీ.. విజయశాంతి పార్టీ మారతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.. విజయశాంతిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మధ్య ఆమె కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఆమెను చేర్చుకున్నదే పార్టీకి అండగా ఉండి ప్రచారాల్లో పాల్గొని పార్టీని బలోపేతం చేస్తారని. కానీ.. ఆమె మాత్రం గత ఎన్నికల్లోనూ అంతగా ప్రచారాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది.
విజయశాంతికి బుజ్జగింపులు:
విజయశాంతి పార్టీ మారతారనే వార్తలు రావడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. విజయశాంతిని సముదాయించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను రంగంలోకి దింపింది. పార్టీ ఆదేశాల మేరకు కుసుమకుమార్ నేరుగా విజయశాంతి నివాసానికి వెళ్లి చర్చలు కూడా జరిపారు. బయట ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, వాటి వల్ల ప్రయోజనాలు లేవని కాంగ్రెస్ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయశాంతితో సంప్రదింపులకు ఫుల్ స్టాప్, లైట్ తీసుకుందామని డిసైడ్:
కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవని గాంధీభవన్‌లో టాక్ వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్‌తో చర్చలు జరిగిన తర్వాత… మీడియాతో కేవలం ఆయన ఒక్కరే మాట్లాడారు. విజయశాంతి మాత్రం మీడియా ముందుకు రాలేదు. పైగా తన ట్విటర్ ఖాతాలో పలు పోస్టులు చేస్తున్నా… పార్టీ మార్పు ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదని, దీంతో ఆమె ఈసారి పార్టీని వీడడం ఖాయమని అంటున్నారు. ఇదంతా అర్థం చేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు సంప్రదింపుల అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారట. విజయశాంతి విషయంలో లైట్ తీసుకుందామని డిసైడ్ అయ్యారట.
వెళ్లిపోయినా నష్టమేమీ లేదట:
విజయశాంతి ప్రస్తుతం పార్టీలో ఉన్నా పెద్దగా ఉపయోగం లేనప్పుడు వెళ్లిపోయినా నష్టమేమీ ఉండదని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఆమె పార్టీ మారడం ఖాయమని, సో రాములమ్మతో మాటల్లేవు.. మాట్లాడుకోవడాలు లేవంటూ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఒక నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. మూడు రోజుల నుంచి ఆమెతో సంప్రదింపులకు ఫుల్‌స్టాప్ పెట్టి.. పట్టించుకోవడం మానేశారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి విజయశాంతి ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.
https://www.youtube.com/watch?v=3jlBQkt2_K4