చుక్కేసిన ఖాకీ : నడిరోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం

ప్రజలు మద్యం తాగి తప్పుగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ పోలీసులే చుక్కేస్తే..ఎలా ఉంటది..నడి రోడ్డుమీద హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ కానిస్టేబుల్ ని చూస్తే తెలుస్తుంది. ఫుల్ గా మద్యం తాగాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేశాడు. డ్యూటీలో ఉండగానే మద్యం తాగాడు. రోడ్డుపై నానా యాగీ చేశాడు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఫలక్ నుమా ప్రాంతంలోని గోశామహల్ రోడ్డులో కానిస్టేబుల్ ఈశ్వరయ్య వీరంగం సృష్టించాడు.
డ్యూటీ వదిలేసి మద్యం తాగి నడిరోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆగి ఉన్న వాహనాల వద్దకు వెళ్లి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించాడు. జోగుతూ నడుస్తూ వాహనాల మధ్య పడిపోయాడు. మళ్లీ లేచాడు. ఓ స్కూటీని మీద వేసుకున్నాడు. ఓ కారు అద్దాలపై కొట్టాడు. ఆ కారుకు అడ్డంగా కూర్చున్నాడు. ఆ మార్గంలో నడిచి వెళ్లే పాదచారులపై కూడా హల్ చల్ చేశాడు.
కానిస్టేబుల్ ఈశ్వరయ్య వీరంగం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈశ్వరయ్యను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. అంతేకాదు ఫలక్ నుమా సీఐకు చార్జ్ మెమో కూడా జారీ చేశారు.