బి అలర్ట్ : హైదరాబాద్ లో నక్సల్స్ రెక్కీ
రాష్ట్రంలో నక్సల్స్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? దాడులు చేసేందుకు పావులు కదుపుతున్నారా? హైదరాబాద్‌లోనే తమ వ్యూహం అమలు చేయాలనుకున్నారా? అంటే అవుననే చెప్పవచ్చు.
రాష్ట్రంలో నక్సల్స్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? దాడులు చేసేందుకు పావులు కదుపుతున్నారా? హైదరాబాద్‌లోనే తమ వ్యూహం అమలు చేయాలనుకున్నారా? అంటే అవుననే చెప్పవచ్చు.
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్స్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? దాడులు చేసేందుకు పావులు కదుపుతున్నారా? హైదరాబాద్‌లోనే తమ వ్యూహం అమలు చేయాలనుకున్నారా? అంటే అవుననే చెప్పవచ్చు. ఇందుకు ఇటీవలే ముగ్గురు అక్కాచెల్లెళ్ల అరెస్టుతో అవుననే సమాధానమే వస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది.
తెలంగాణపై మావోయిస్టులు దృష్టి..
దాడి, వ్యూహాల్లో దిట్ట అయిన నంబాల బాధ్యతలు చేపట్టాకే ఏపీలోని పాడేరులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హత్య చేశారు. ఆ తర్వాత మావోయిస్టులు తెలంగాణపై దృష్టి సారించారు. పోలీసుల దృష్టి మళ్లించడానికి పల్లెల్లో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ… హైదరాబాద్‌లో తమ వ్యూహం పక్కాగా అమలుకు ఏర్పాటు చేశారనేందుకు పోలీసులు ఆధారాలు గుర్తించారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, విలేజ్ పోలీసు అధికారుల (వీపీఓ) నియామకం, భద్రతా చర్యల్లో భాగంగా పల్లెల్లోనూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చడంతో నిఘా ఎక్కువగా ఉందని మావోయిస్టులు హైదరాబాద్‌ను ‘సేఫ్ జోన్’గా భావించినట్లు తెలుస్తోంది.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు మౌలాలిలో నివాసం..
గతవారం విశాఖ పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు అక్కాచెల్లెళ్లు (అనూష, అన్నపూర్ణ, భవానీ) నాలుగు నెలల క్రితం వరకు హైదరాబాద్‌లోని మౌలాలీలో ఉండేవారు. తర్వాత కాప్రా సర్కిల్ మౌలాలి హౌజింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర నగర్‌కు మకాం మార్చారు. వారి ఇంటికి తరచూ కొందరు వ్యక్తులు వచ్చి వెళ్లేవారని చుట్టుపక్కలవారు చెబుతుండటంతో వారెవరో కనుగొనేందుకు పోలీసులు దృష్టి సారించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. అనూష గత సంవత్సరం దళంలో చేరి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ఆర్‌కే భద్రతా సిబ్బందితో కలిసి కొంతకాలం పని చేసినట్లు సమాచారం.
అడవి నుంచి హైదరాబాద్ చేరుకున్న అనూష..
మూడు నెలల క్రితం అనూష దళంలో ఉండగా మద్యగరువు అటవీ ప్రాంతంలో ఆమె అక్కలు అన్నపూర్ణ, భవానీతో పాటు మరికొందరు కలిశారు. మావోయిస్టు ఉదయ్‌కు మందులు, విప్లవ సాహిత్యం, మహిళా మావోయిస్టులకు అవసరమైన దుస్తులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనూష అడవి నుంచి బయటకు వచ్చి అక్కలతో కలిసి హైదరాబాద్ చేరుకుంది. నగరంలో మావోయిస్టుల దాడులకు వీలుగా ఆయా వ్యక్తులు, ప్రదేశాలపై రెక్కీ, రెక్కీలో పాల్గొనే వారికి స్థావరాలు ఏర్పాటు, అవసరమైన వస్తువులు సమకూర్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ముగ్గురు యువతుల అరెస్టు..
ఇంతలో అర్బన్ మావోయిస్టులపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాల పోలీసులు ముగ్గురు అక్కా చెల్లెళ్లను అరెస్టు చేశారు. వారిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించేందుకు సిద్ధమవుతున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముందని ఏపీలోని విశాఖపట్నం రూరల్ ఎస్పీ అట్టాడ బాబూబీ మీడియాకు చెప్పారు. కాగా 2003లో ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడిన ఘటనలో భవానీ భర్త కృష్ణ పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణ మావోయిస్టు పార్టీలో డీసీఎంగా పనిచేస్తుండటం గమనార్హం.