పంచాయతీ సమరం : మూడు విడతల్లో ఎన్నికలు

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 01:59 AM IST
పంచాయతీ సమరం : మూడు విడతల్లో ఎన్నికలు

హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వినియోగించనుంది ఎన్నికల సంఘం. మరోవైపు నోటిఫికేషన్ వెలువడటంతో కొత్తగా ఏర్పడిన గిరిజన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జనవరి 21న మొదటి విడత పోలింగ్.. జనవరి 25న రెండో విడత.. 30న మూడో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. 

బ్యాలెట్ పద్ధతిలో…
12,732గ్రామ పంచాయతీలు, 1, 13, 170వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలకు నిర్వహించేకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తుకు స్థానం కల్పించింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలు పెడతామన్నారు. తొలుత వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అదే రోజు వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో కోటి 49లక్షల 52వేల 058 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తొలి విడతలో…
తొలి విడతలో 4480 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో 4137, మూడో విడతలో 4115 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలివిడత ఎన్నికలకు జనవరి 7న రిటర్నింగ్ అధికారులు నోటీస్ ఇస్తారు. 7 నుంచి 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 10న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల విషయంలో అభ్యంతరాలుంటే.. 11న ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవచ్చు. 12న వాటికి ఆర్డీవోలు పరిష్కారం చూపుతారు. 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 21న పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. 

రెండో విడతలో…
రెండో విడత ఎన్నికలకు జనవరి 11న రిటర్నింగ్ అధికారులు నోటీస్ ఇస్తారు. 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విషయంలో అభ్యంతరాలుంటే.. జనవరి 15న ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవచ్చు. 16న వాటికి పరిష్కారం చూపుతారు. 17న నామినేషన్ల ఉపసంహరణ, 25 పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. 

మూడో విడతలో…
మూడో విడత పోలింగ్‌కు జనవరి 16న రిటర్నింగ్ అధికారులు నోటీస్ ఇవ్వనున్నారు. 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 19న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల విషయంలో అభ్యంతరాలుంటే.. 20న ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవచ్చు. 21న వాటికి ఆర్డీవోలు పరిష్కారం చూపుతారు. 22న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. 30వ తేదీన మూడో విడత ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. 

అభ్యర్థుల ఖర్చు…
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఖర్చు పరిమితిని ఎన్నికల కమిషన్  ప్రకటించింది. 5వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రెండున్నర లక్షలు,  వార్డు మెంబర్ అభ్యర్థుల ఖర్చు రూ.50వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు లక్షా యాభైవేలు,  వార్డు మెంబర్ అభ్యర్థుల ఖర్చు రూ.30వేలు దాటకూడదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది.