ఇచట డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేయబడును

ఇచట డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేయబడును

Updated On : August 29, 2019 / 3:17 AM IST

రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న డెంగ్యూ నిర్మూలనకై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి డెంగ్యూ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను జారీ చేసింది. బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లోనూ డెంగ్యూకు పరీక్షలు ఉచితంగా చేస్తారట. దీంతో పాటు వైరల్ ఫీవర్‌కు సంబంధించిన పరీక్షలను సైతం ఉచితంగా చేస్తారు. ఇది అందరికీ తెలిసేలా పెద్ద బోర్డులు ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి వర్గాలకు సూచించింది.  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, రోగులను పట్టించుకోకపోవడం వంటి సమస్యలతో గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలాంటివి ఉండకూడదని సిబ్బందికి డబ్బులిచ్చి వైద్యం చేయించుకోవాలనుకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. వైద్యులు అందుబాటులో ఉండాల్సిందేనని ప్రత్యేకంగా వివరించారు. 

ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకం:
ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నాయంటూ రూ.40వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ఇదిలా ఉంటే, ప్లేట్‌లెట్ కౌంట్‌ను సరిగ్గా చెప్పకుండా తప్పుడు రిపోర్ట్‌లు ఇస్తున్నారు. సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య 20వేలు కంటే తక్కవగా ఉంటేనే సమస్య పెరుగుతుందని.. అప్పుడే ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. కానీ పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్లేట్‌లెట్లు 50వేలకు పడిపోయినా ఐసీయూకు తరలించి చికిత్స చేసి లక్షలు గుంజుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వమే ఉచితంగా డెంగీ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది.