పథకానికి తూట్లు : డాక్టర్లు, లాయర్లకు తెల్లరేషన్ కార్డు

  • Published By: chvmurthy ,Published On : February 18, 2019 / 07:06 AM IST
పథకానికి తూట్లు : డాక్టర్లు, లాయర్లకు తెల్లరేషన్ కార్డు

Updated On : February 18, 2019 / 7:06 AM IST

హైదరాబాద్ : నిరుపేదలైన వారికి తెల్ల రేషన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో  ప్రభుత్వం చేపట్టిన పధకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. సుమారు 10వేల మందికి పైగా అనర్హులు ఈపధకం ద్వారా రాష్ట్రంలో లబ్ది పొందుతున్నారు. వీరిలో 7 వేల మంది కి పైగా  ప్రభుత్వోద్యోగులు, 3వేలమంది  నెలకు 10వేలకు మించి ఫించను పొందేవారు ఉన్నట్లు తేలింది. “ప్రధాననమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి”(పీఎం-కిసాన్) పధకంలో భాగంగా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు వ్యవసాయ శాఖ చేపట్టిన సర్వే లో ఇలాంటి వాస్తవాలు వెలుగు చూశాయి. 

‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం కింద ఐదెకరాల్లోపు రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని కేంద్రం తెలిపింది. ఇక భూమి ఉన్న ఉద్యోగుల విషయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో 4వ తరగతి వారు మినహా మిగతా వారంతా అనర్హులని పథకం నిబంధనలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ పధకంలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపించేందుకు వ్యవసాయ శాఖ  అధికారులు ప్రయత్నం మొదలెట్టారు. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్నతెల్లకార్డు కుటుంబాల సమాచారాన్ని తీసుకుని దాన్ని ఉద్యోగుల ఆధార్‌ సంఖ్యలతో ఆన్‌లైన్‌లో పోల్చి చూడగా  అనర్హులుగా 7 వేల మంది తెల్లకార్డుదారులు ఉన్నట్లు లెక్క తేలింది. వారికి ఐదెకరాల్లోపు భూమి ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులైనందున ‘పీఎం కిసాన్‌’ వర్తించని కారణంగా వారి పేర్లను జాబితాను తొలగించారు. ఇక నెలకు రూ.10 వేలకుపైగా పింఛను పొందే విశ్రాంత ఉద్యోగులు సైతం భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా అనర్హులు. ఇలా ఫించను తీసుకుంటున్నదాదాపు 3 వేల మందికి తెల్లకార్డులు ఉన్నట్లు గుర్తించి వారిని తొలగించారు.

గ్రామసభల్లో మరికొందరి పేర్లు తొలగింపు
ఫిబ్రవరి 18  సాయంత్రాని కల్లా మొదటి విడతలో 21 లక్షల మంది రైతుల పేర్లను కేంద్రానికి ఆన్‌లైన్‌లో పంపాలనేది అధికారుల లక్ష్యం. పీఎం-కిసాన్‌ పథకానికి అర్హుల గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులతోపాటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీలను అనర్హులుగా ఈ సభల్లో గుర్తించి తొలగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తొలివిడతలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.2 వేల జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కనుక ఈరోజు సాయంత్రంలోగా  వీలైనంత ఎక్కువ మంది రైతుల పేర్లను పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు కృషి చేస్తున్నారు. 

తెల్ల కార్డులున్నవారిలో పేదలను మాత్రమే ఈ పథకానికి తీసుకున్నారు. ఇక  పింక్ కార్డులున్న మరో 9 లక్షల మందిలో  ఎంతమంది ఐదెకరాల్లోపు భూమి కలిగి ఉన్నారనే వివరాలను  రెండో దశలో పరిశీలించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆతర్వాత మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసలు ఎంతమందికి, ఎంతెంత భూమి, ఉందనే సమాచారం కూడా సేకరించాలని  వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏ రేషన్‌కార్డులేని కుటుంబాలు మరో 3 లక్షలు ఉన్నాయని అధికారులు అంచనా వేసారు. వారిలో ఎందరికి ఐదెకరాల్లోపు భూమి ఉందనే విషయాన్ని గ్రామసభల్లోనే పరిశీలించాలని సూచించినట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి చెప్పారు.  ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఈ పథకం కింద లబ్ధి పొందొద్దని పొరపాటున వారి ఖాతాల్లో సొమ్ము జమైనా వెంటనే వ్యవసాయాధికారికి సమాచారం ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి  సూచించారు.