సోషల్‌ మీడియాకు ఈసీ కళ్లెం 

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 07:52 AM IST
సోషల్‌ మీడియాకు ఈసీ కళ్లెం 

Updated On : March 24, 2019 / 7:52 AM IST

హైదరాబాద్ : సోషల్‌ మీడియాకు కళ్లెం వేసేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ సిద్ధమైంది. ఎన్నికల వేళ రెచ్చిపోయే సోషల్‌ మీడియా యోధులకు ముకుతాడును రెడీ చేసింది. దీనికి సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు కూడా సై అన్నాయి. నైతికంగా ముందుకు వచ్చి సోషల్‌ మీడియా ప్రచారానికి, వెకిలి రాతలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయించాయి.

మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. పిలిచింది అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ ఆధునిక కాలంలో మనకు తెలియకుండానే విస్తరించిన మరో ప్రపంచం … జన సామాన్యాన్ని పిలవడమే కాదు ప్రభావితం చేస్తోంది. జనం సమయాన్ని తనవైపు లాక్కుంటోంది. అదే ఆన్‌లైన్‌ ప్రపంచం… అదే సోషల్‌ మీడియా.. స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతి అంశం సోషల్‌ మీడియా గోడలపైకి ఎక్కుతోంది. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడమే కాదు.. మరికొందరిని ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం.. సార్వత్రిక సమరంలో రాజకీయ పార్టీల సోషల్‌ మీడియా ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ.. లెక్క తెలియకుండా జరుగుతున్న ప్రచారానికి, రెచ్చగొట్టే రాతలకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది.

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కొలమానం. అందులో ఓట్లే ప్రధాన అస్ర్తాలు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమరంలో ఆ ఓట్లను కొల్లగొట్టేందుకే అనేక ప్రయత్నాలు చేస్తారు నాయకులు. ఎప్పుడూ కనబడని నేతలంతా జన సామాన్యంలోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తారు. హామీలు గుప్పిస్తారు. అయితే నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తిని కలవడం అభ్యర్థులకి కష్టసాధ్యమే. అందుకోసమే వారి తరపున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారాన్ని నిర్వహిస్తుంటారు. మారుతున్న కాలంతో పాటు ప్రచార పద్దతులూ మారాయి. ఒకప్పుడు ప్రత్యక్షంగా ఇంటింటికి తిరిగే స్థాయి నుంచి ఒకే దగ్గర కూర్చుని అందరికీ చేరువయ్యే పద్దతుల స్థాయికి ఎదిగింది. ఇటీవల సోషల్‌ మీడియా వినియోగం పెరగడంతో దాన్ని అందిపుచ్చుకుంటున్నాయి పార్టీలు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

సోషల్‌ మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉండటంతో ప్రతి పార్టీ, నేత.. సోషల్‌ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ పార్టీ చేస్తున్న పనులు, ఇస్తున్న హామీలను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ల ద్వారా జనానికి చేరేలా చేస్తున్నారు. దీనికితోడు ఎన్నికలకు రెండు రోజుల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉండగా.. సోషల్‌ మీడియాకు అలాంటి నిబంధనలేమీ లేవు. దీంతో పార్టీలన్నీ రోడ్ల పై నుంచి ప్రచారాన్ని సోషల్‌ మీడియా గోడలపైకి మార్చాయి. ఎన్నికల ముందు నుంచి.. ఓ పక్కన ఎలక్షన్స్‌ జరుగుతున్న సమయంలోనూ ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. 

ప్రచారంతో పాటు విమర్శల బాణాలు కూడా సోషల్‌ మీడియా వేదికపై దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తూ.. అనేక ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల ప్రచారంలోనూ వేడేక్కిస్తున్నాయి స్పెషల్‌ వింగ్‌లు. స్పూఫ్‌ వీడియోలతో తమ నేతలను హీరోలుగా చిత్రీకరిస్తూ.. ప్రత్యర్థి పార్టీ నేతలను విలన్లుగా చిత్రీకరిస్తున్నాయి. అసభ్యకర పోస్టులు, అవమానరమైన రాతలతో రెచ్చిపోతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి పోస్టులు శృతిమించుతున్నాయి. 

ఈ పరిస్థితులపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలకు పూనుకుంది. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న సోషల్‌ మీడియాకు పగ్గాలు వేసేందుకు సిద్ధమైంది. దీనికి సామాజిక మాధ్యమాల యాజమాన్యాల నుంచి కూడా తోడ్పాటు అందడంతో ఈసారి సోషల్‌ మీడియా ప్రచారం ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.