తెలంగాణలో ఎన్నికల కోడ్ : అన్నదాతలకు రుణాల కష్టాలు

మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాబోతోంది. తొలకరి పలకరించగానే రైతన్నలు వ్యవసాయపనుల్లో తలమునకలవుతారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని.. వానాకాలం సీజన్ రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు.. ఎన్నికల కోడ్‌కు సంబంధమేంటి? రైతులు కోరుతన్నదేంటి? తక్షణం చేపట్టాల్సిన చర్యలేంటి? మరో పదిహేను రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు రానున్నాయి. రాష్ట్రంలో 70శాతం మేర భూమి వర్షాధారం కావడంతో… వానాకాలం పంటల సాగుకు రైతన్నలు సమాయాత్తమవుతారు.
దుక్కులు దున్నడం దగ్గరి నుంచి విత్తనాలు, ఎరువుల వరకు ప్రతీది డబ్బులతో కూడుకున్న వ్యవహారం. పెట్టుబడి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. రైతులు ప్రధానంగా బ్యాంకు రుణాలపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. గత ఏడాది నుంచి కేసీఆర్ సర్కార్ ఇస్తున్న పంటపెట్టుబడి సాయం కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ ఈసారి బ్యాంకు రుణాలు రైతులకు అందే పరిస్థితి కనిపించడం లేదు.
రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు TRS ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, లోన్‌లు రీషెడ్యూల్ చేసుకోలేదు. రుణాలు చెల్లించాలంటూ ఇటీవల జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, చివరకు ప్రభుత్వ రంగంలోని సహకార బ్యాంకులు కూడా రైతులకు నోటీసులు ఇచ్చాయి. రుణం తిరిగి చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామంటూ మెలిక పెట్టాయి. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పుచేసి బ్యాంకులకు రుణాలు చెల్లిస్తే… ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ వర్తిస్తుందా అనే భయం రైతులను వెంటాడుతోంది.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. రుణమాఫీ చేయడానికి అవసరమైన క్షేత్రస్థాయి ప్రక్రియ పూర్తయ్యిందని, కోడ్ ముగియగానే మాఫీ చేపడుతామంటున్నారు అధికారులు. దీనికి బలం చేకూరుస్తూ ప్రజా ప్రతినిధులు కూడా పలు ప్రకటనలు చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ రుణమాఫీకి ఆరువేల కోట్ల రూపాయలను కేటాయించారు. నాలుగు విడతల్లో జరిగే రైతు రుణాలను చెల్లిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే తాము రుణాలు ఇచ్చేందుకు సిద్దమని క్షేత్రస్థాయి బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు.
రైతుంబంధు పెట్టుబడి సాయం అందించేందుకు కోడ్ అడ్డంకి ఏమీ లేకపోయినా.. కొత్తవారికి రైతుబంధు ఇవ్వకూడదని ఈసీ ఆదేశించింది. దీంతో ఆరున్నర లక్షల మంది కొత్తవారు ఈసారి కూడా పెట్టుబడిసాయం పొందే అవకాశం లేదు. గత సీజన్‌లోనే సాయం పొందని వారికి ఈసారి పెట్టుబడి ఇచ్చేందుకు రైతుబంధును ఈ నెలాఖరుకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్‌తో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అమలుకాక… బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక, మరోపక్క రైతుబంధు సాయం ఆలస్యంకావడంతో రైతన్నలకు కష్టాలు తప్పేలా లేవు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ అనుమతి తీసుకుని ఖరీఫ్ కంటే ముందే తమకు బ్యాంకు రుణాలు అందేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.