అవినీతిపరులకు నో ఛాన్స్ : లోకల్ ఎన్నికలకు మార్గదర్శకాలు

  • Published By: chvmurthy ,Published On : April 15, 2019 / 05:49 AM IST
అవినీతిపరులకు నో ఛాన్స్ : లోకల్ ఎన్నికలకు మార్గదర్శకాలు

హైదరాబాద్ : మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల విధి విధానాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లోని 210 లో పలు సెక్షన్లను అనుసరిస్తూ ఈ నిబంధనలను విధించింది. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలతోపాటు రిటర్నింగ్ అధికారుల విధులు, బ్యాలెట్ పత్రాల తయారీ, అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్లను స్పష్టంచేస్తూ మార్గదర్శకాలను జారీచేసింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా ఎన్నికల సంఘం విధివిధానాలను ఖరారు చేసింది.  ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గాల్లో సభ్యుడిగా ఉండటం, పదవీకాలం ఇంకా పూర్తి కాకపోవడం, ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతున్న సమయానికి పదవీకాలం ముగియకపోవడం, గ్రామ పంచాయతీలకు పాలకవర్గ సభ్యుడిగా ఇదివరకే ఎన్నికైనప్పటికీ పదవీ కాలం ఇంకా ప్రారంభం కానప్పటికీ పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏదైనా ప్రభుత్వ హోదాలో ఉండి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా బకాయి ఉన్నా,  నోటీసులు జారీ అయినా  సరైన సమయంలో బకాయి చెల్లించని వారు కూడా పోటీచేసేందుకు అనర్హులు. వీటితోపాటు ఐపీ పెట్టిన వారు, ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, మతిస్థిమితం లేనివారు, ఆర్థిక నేరాలకు పాల్పడే వారు  పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఎన్నికల ఖర్చులు చూపించని వారిని కూడా పోటీకి దూరంచేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన వారు చాలా మంది ఖర్చు చూపించలేదు. చాలా మంది ఆశావహులుగా ఉండటంతో వారంతా పోటీచేస్తే ఎన్నికల ఖర్చు చూపించాలని నిబంధనలు విధించారు. గతంలో పోటీచేసి ఖర్చు చూపించని వారిపై ఫిర్యాదులు కూడా స్వీకరించనున్నారు.

ఇందులో భాగంగా అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోకుండా నిషేధం విధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధీనంలో ఉండే కార్యాలయాల్లో పనిచేస్తూ లంచం తీసుకున్నా లేదా ఇతర మోసాలకు పాల్పడినా.. విశ్వాసఘాత నేరాల కింద.. ఉద్యోగులైనా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టంచేశారు. అవినీతి, ఆరోపణలపై తొలగించబడిన వారు ఐదేళ్ళ కాలపరిమితి వరకు అనర్హులుగా పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటివరకు పలు పదవుల్లో, ప్రజాప్రతినిధులుగా ఉండి, అవినీతి, ఆరోపణలు రుజువై పదవుల నుంచి తొలిగించబడినవారు కూడా పోటీకి అనర్హులే. బ్యాలెట్ ముద్రణలో సైతం మార్గదర్శకాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలిచ్చారు. ఎనిమిది గుర్తులతో ఒకే వరుస బ్యాలెట్‌ను ముద్రించాలని సూచించారు. ఉదాహరణకు ఏడుగురు అభ్యర్థులు ఉంటే ఏడు గుర్తులు, ఒక నోటా గుర్తుతో కలిసి ఒక వరుస బ్యాలెట్ ఉండనున్నది. ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎనిమిది గుర్తులతోపాటు నోటా గుర్తుతో మరో వరుస బ్యాలెట్ ముద్రించనున్నారు. 

నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ తర్వాత రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవాలను వెంటనే  ప్రకటించరాదని, జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణ తర్వాతే ప్రకటన చేయాలని సూచించారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది వరకు ఓటర్లుంటే.. ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు పోలింగ్ అధికారులు, అంతకు మించి ఎక్కువఉండి 600 లోపు ఓటర్లున్న పోలింగ్ బూత్‌ల్లో ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు ఐదుగురు పోలింగ్ అధికారులు ఉండాలని మార్గదర్శకాల్లో సూచించారు.ఓటరు గుర్తింపుపై ఈసారి పరిషత్ ఎన్నికల నేపథ్యంలో చాలెంజ్ ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి చాలెంజ్ ఓటుకు సదరు ఓటరు రూ.5 ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి, రసీదు తీసుకోవాలి.  

పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచార ఖర్చును కచ్చితంగా బ్యాంకు ఖాతాల నుంచే  చెల్లించాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. నామినేషన్ల సమయంలోనే రిటర్నింగ్ అధికారికి బ్యాంక్ ఖాతా నంబర్లు, పాస్‌బుక్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంపీటీసీ స్థానమైనా, జెడ్పీటీసీ స్థానానికైనా పోటీచేసే అభ్యర్థులు ఒకే స్థానం నుంచి నామినేషన్లు వేయాలి. రెండు స్థానాల్లో పోటీ చేస్తామని నామినేషన్లు దాఖలుచేస్తే వాటిని తిరస్కరిస్తారు. పరిషత్ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల నేర చరిత్ర, కేసులు, విద్యార్హతపై డిక్లరేషన్ తీసుకోనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇస్తే వారిని ఎన్నికలకు దూరం చేయడమే కాకుం డా కేసులు నమోదు చేయనున్నారు.