ఫ్యాన్సీ నంబర్ల పేరిట మోసం చేశాడు: అతడి బాధితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా!

ఫ్యాన్సీ నంబర్లు అంటే అందరికీ పిచ్చి ఉంటుంది. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులకు అయితే ఇది ఇంకాస్త ఎక్కువే దానినే అలుసుగా తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఎయిర్‌టెల్ సీఈవోనని చెప్పి బడా బాబులను నమ్మించాడు. మొబైల్ ఫ్యాన్సీ నంబర్లను తక్కువ ధరకు ఇస్తానంటూ చివరకు మోసం చేశారు. అనేకమందికి కుచ్చుటోపీ పెట్టిన అటువంటి వ్యక్తిని సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన మద్దెల దీపుబాబు.. హైదరాబాద్‌కు చెందిన జానకీరామ్ అనే వ్యక్తికి సెప్టెంబర్ 19న మొబైల్ ఫ్యాన్సీ నంబర్లు కావాలా? అంటూ ఫోన్ చేశాడు. తన దగ్గర ఫ్యాన్సీ నంబర్లు ఉన్నాయని, తక్కువ ధరకే ఇస్తానంటూ చెప్పి తర్వాత 9899999999, 9123456789, 9999999099, 9999999999 నంబర్లను మెసేజ్ చేశాడు. ఎయిర్‌టెల్ సీఈఓని అని చెప్పి నమ్మించి గోపాల్ అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు.
ఫ్యాన్సీ నంబర్లపై ఇద్దరు మాట్లాడుకొని చేసుకొన్న ఒప్పందం ప్రకారం రూ.45వేల 800 డబ్బును అతడు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు జానకీ రామ్. డబ్బు డిపాజిట్ అయిన వెంటనే సదరు వ్యక్తి స్పందించలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మోసపోయానని గ్రహించిన జానకీరామ్.. సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ బీ మధుసూదన్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని బెంగళేరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు.
నిందితుడు మద్దెల దీపుబాబు 2014 నుంచి మొబైల్ ఫ్యాన్సీ నంబర్ల పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లే లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ప్రజాప్రతినిధులకు ఫోన్‌చేసి ఎయిర్‌టెల్ సీఈవోనంటూ పరిచయం చేసుకోవడం, బురిడీ కొట్టించడం పనిగా పెట్టుకొన్నాడు.
ఫోన్ చేస్తున్న వ్యక్తి నిజంగా ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ అని భ్రమపడేట్టుగా ట్రూకాలర్ ఐడీని ఫీడ్ చేసుకున్నాడు. బ్యాంకు ఖాతా పేరును ఎయిర్‌టెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పడంతో అందరూ అతని మాటలు నమ్మి మోసపోయారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతడి వలకు చిక్కిన ఎమ్మెల్యే ఒకరు రూ.3లక్షలు, ఎమ్మెల్సీ ఒకరు రూ.2లక్షల సమర్పించుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మోసపోయిన ప్రజాప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో దీపుబాబు మరింతమందిని మోసం చేసినట్లుగా తెలిసింది.