ఫస్ట్ టైమ్ : గూగుల్ మ్యాప్స్‌లో గణేషుడి ‘శోభాయాత్ర’

హైదరాబాద్ నగరం వ్యాప్తంగా పూజలందుకున్న గణనాథులు తల్లి గంగమ్మ ఒడికి చేరనున్నారు. హైదరాబాద్ మహానగరంలో గణేషుడు మహా నిమజ్జం కోలాహలంగా పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య జరగనుంది. ఈ యాత్ర..అనంతరం వినాయకుల నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. భక్తుల రక్షణే ముఖ్యంగా భావిస్తున్న అధికారులు టెక్నాలజీ సహాయంతో అంగుళం అంగుళాన్ని పర్యవేక్షించనున్నారు.
దీని కోసం మొదటిసారిగా అధికారులు గూగుల్ మ్యాప్స్‌లో గణేష్ ‘శోభాయాత్ర’ను అప్‌డేట్ చేస్తుంటారు. గూగుల్ మ్యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తారు. చీమ చిటుక్కుమన్నా పట్టేస్తారు. వెంటనే ఆయా శాఖల సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి పర్యవేక్షిస్తారు. ఆయా పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటారు. దీనికి ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు.
గురువారం (సెప్టెంబర్ 12)న ఉదయం నుంచి నగరమంతటా ఉన్న వినాయకుల శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా 391 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ మహా నిమజ్జనోత్సావానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్‌ఎంసీ, పోలీస్, జలమండలి, శానిటేషన్, ఫైర్, వైద్యారోగ్య, విపత్తుల నివారణ, విద్యుత్ వంటి సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
దీంట్లో భాగంగా నగరంలోని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీంను నియమించనున్నారు. ఈ టీమ్ లో అన్ని శాఖలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతాల్లో జరగనున్న గణేషడి నిమజ్జానికి చెరువులు వద్దా..భారీగా నిమజ్జనం జరిగనున్న హుస్సేన్‌సాగర్ వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు. అటు పోలీసులు..ఇటు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు.