సార్వత్రిక సమరం : తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్‌సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది పోటీలో ఉండగా… అతి తక్కువగా మెదక్ లోక్‌సభకు 10 మంది పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. నిజామాబాద్‌లో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై… సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
తెలంగాణలో 2 కోట్ల 97 లక్షల 8వేల 599 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కోటి 49 లక్షల 30వేల 726 మంది పురుష ఓటర్లు ఉన్నారు. కోటి 47 లక్షల 76వేల 370 మంది మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 4 లక్షల 69,30 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఇక థర్డ్ జెండర్స్ 1504 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 11వేల 320 మంది ఉన్నారు. ఇక ఎన్నారై ఓట్లు తెలంగాణలో 1731 ఉన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా 34వేల 604 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఇందులో సమస్యాత్మక కేంద్రాలుగా 5వేల 749 గుర్తించింది. 2 లక్షల పైచిలుకు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 80వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 79 వేల 882 ఈవీఎంలు, 46 వేల, 731 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. 42వేల 853 కంట్రోల్ యూనిట్లను ఈసీ వినియోగిస్తోంది.