Don’t waste: నగరంలో పది చోట్ల ఉచిత ఫ్రిజ్‌లు

Don’t waste: నగరంలో పది చోట్ల ఉచిత ఫ్రిజ్‌లు

Updated On : January 28, 2019 / 6:31 AM IST

ఇక నుంచి భాగ్యనగరంలో పది ప్రదేశాల్లో ఉచిత ఫ్రిజ్‌లు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఇప్పటికే నిరుద్యోగులకు, ప్రయాణాలలో ఉన్నవారికి అతి తక్కువ ధర రూ.5కే భోజన సదుపాయం అందిస్తోన్న జీహెచ్ఎంసీ మరో సరికొత్త నిర్ణయానికి తెరలేపింది. నగరంలో ఎక్కడ కూడా ఆహారమనేది వృథా కాకూడదన్న కారణంతో ఆహారాన్ని నిల్వ చేయనున్న తలంపుతో ఈ కార్యక్రామానికి ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో ఓ ఎన్జీవో సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. 

అనాథాశ్రమం నడిపిస్తున్న మణికొండలోని ఓ ఎన్జీవో ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లోని కీలకమైన 10 ప్రదేశాల్లో ఫ్రిజ్‌లు ఉంచాలని నిర్ణయించింది. ఎవరైతే ఫంక్షన్లలో, హోటళ్లలో, ఇళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని వృథా చేయకుండా దానం చేయాలని భావిస్తారో వారు ఈ ఫ్రిజ్‌లలో ఆహారాన్ని నిల్వ చేయొచ్చు. 530లీటర్ల సామర్థమున్న ఈ ఫ్రిజ్‌లలో ఆహారం చేరాల్సిన చోటుకే చేరుతుంది. ఆ ఫ్రిజ్‌కు అందుబాటులో ఉంటూ రోజూ పరిశుభ్రంగా ఉంచేందుకు ఓ వికలాంగుడిని ఏర్పాటు చేయనున్నారు. 

తాత్కాలికంగా వాటి వద్ద ఓ షెడ్‌ను ఏర్పాటు చేసి దానిపై జీహెచ్ఎంసీ, ఎన్జీఓ కంపెనీల లోగోలను ఉంచుతారు. దీనికి జీహెచ్ఎంసీ నుంచి కేవలం కరెంట్ సదుపాయం మాత్రమే ఇవ్వనుంది. మునిసిపల్ కార్పొరేషన్, ఎన్జీవోల మధ్య ఒప్పందానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక పనులు ఇప్పటికే మొదలైయ్యాయి. 

ఫ్రిజ్‌లు ఉంచాలని భావిస్తున్న ప్రదేశాలివే:

  • శిల్పారామం, ఎయిర్ పోర్టు బస్టాప్
  • ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి
  • జూబ్లీ హిల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 
  • సైబర్ పెర్ల్ దగ్గర, హోటల్ ట్రిడెంట్
  • బంజారా హిల్స్, ఇండో అమెరికన్ హాస్పిటల్
  • మాదాపూర్, రత్నదీప్ దగ్గరి ప్రాంతంలో
  • ఈఎస్ఐ హాస్పిటల్
  • నీలోఫర్ హాస్పిటల్
  • చందానగర్, మెట్రో స్టేషన్
  • గచ్చీబౌలి, ట్రాఫిక్ సిగ్నల్