రూ. 5వేలు జరిమానా కట్టిన మంత్రి తలసాని

అనుమతి లేని ప్రాంతంలో కటౌట్ ఏర్పాటు చేయడంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) భారీ జరిమానా విధించింది. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ ప్రాంగణంలో ఈ నెల 17న నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జన్మదినోత్సవాలను పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన ఫొటోతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చిత్రాలతో భారీ కటౌట్‌ను నెక్లెస్ రోటరీ వద్ద ఏర్పాటు చేశారు.
ఉయ్ లవ్ కేసీఆర్ అంటూ వేసిన భారీ కటౌట్‌ను అనుమతి లేనిచోట నిబంధనలను అతిక్రమించారంటూ జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్ ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు పంపారు. దీంతో మంత్రి తలసానికి అధికారులు రూ.5 వేల జరిమానా వేశారు. అంతేకాదు జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడి నుంచి దానిని తొలగించారు. జీహెచ్‌ఎంసీ విధించిన జరిమానాపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కార్యకర్తలు తెలియక నెక్లెస్ రోడ్డులో కటౌట్ ఏర్పాటు చేశారని అన్నారు. కార్యకర్తలకు జీహెచ్‌ఎంసీ రూల్స్ తెలియవని, వారి రూల్స్ ప్రకారం ఫైన్ విధించారని అన్నారు. తెలియకనే తప్పు జరిగిందని, బాధ్యతగా జీహెచ్ఎంసీకి ఫైన్ కట్టేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ‘ఉయ్ లవ్ కేసీఆర్’ అంటూ పెద్ద కటౌట్‌లో పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తలసాని ఫొటోలు ఉన్నాయి.