గాలివాన బీభత్సం : జాగ్రత్తగా ఉండాలని GHMC వార్నింగ్

హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ చెప్పింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, ఇంజినీర్లను అలర్ట్ చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. సోమవారం (ఏప్రిల్ 22,2019) హైదరాబాద్ నగరంలో గాలి వాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఒకరు చనిపోయారు. దీంతో మంగళవారం ఉదయం వాకర్స్ ను లోపలికి అనుమతించలేదు.
సోమవారం నగరంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు నగరవాసులు వణికిపోయారు. వర్షం కురిసింది కాసేపు అయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
గాలి దుమారానికి ఓ బాలుడు బలయ్యాడు. ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్ హౌజింగ్ బోర్డు కాలనీలో నవనీతరాజు (7) ఇంటిపక్కనే ఉన్న పెద్దమ్మ వాళ్ల ఇంటికి ఆడుకోవడానికి వెళ్లాడు. రేకుల ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ముంచెత్తిన గాలి దుమారం ధాటికి ఆ ఇంటిపై రేకులు ఎగిరి నవనీతరాజుపై పడ్డాయి. రాజు వాటి మధ్య ఇరుక్కుపోయి గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. సోమవారం ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మరోసారి ప్రాణనష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంది.