ప్రత్యేక మెనూ : సంక్షేమ హాస్టళ్లలో టీ..సమోసా

హైదరాబాద్ : సంక్షేమ వసతి గృహాల్లోకి వెళితే…మీకు అక్కడ మెనూలో సమోసా..టీ…దిల్ పసంద్‌లు కూడా కనపడుతాయి. ఇప్పటికే పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం మెనూలో వాటిని కూడా చేర్చాలని యోచిస్తోంది. ఎందుకంటే పదో తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదా…వారు ఎక్కువ సేపు చదువుకోవడానికి సంక్షేమ శాఖలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగించాలని..విద్యార్థులను మరింత ప్రోత్సాహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ అదనంగా స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. వసతి గృహా విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్నం మాత్రం పాఠశాలలో భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. టెన్త్ క్లాసు స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ. 15 చొప్పున 100 రోజుల పాటు ఖర్చు చేయనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో మొత్తం 715 సంక్షేమ హాస్టలున్నాయి. ఇందులో టెన్త్ క్లాసు చదువుతున్న వారు 22 వేలకు మందికి పైగా ఉన్నారు. అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందనే వస్తుంది. విద్యార్థులు కూడా ఉత్సహాంతో ఎక్కువ సేపు చదువుతున్నారని అధికారులు చెబుతున్నారు.