ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదు : అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్దత లేదని స్పష్టం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉన్నమాట వాస్తవమే అయినా.. ఇంకా విభజన పూర్తికానందున టీఎస్‌ఆర్టీసీలో కేంద్రం వాటాపై ప్రశ్నే తలెత్తబోదని వాదనలు వినిపించారు. టీఎస్‌ఆర్టీసీకి కేంద్రం వాటా ఆటోమేటిక్‌గా బదిలీ కాదని.. ఆర్టీసీ రీ ఆర్గనైజేషన్‌కు తమ అనుమతి కూడా కోరలేదని కోర్టుకు చెప్పారు. కేంద్రం వాదనలకు అధికారులు కౌంటర్ వాదనలు వినిపించారు.
ఆర్టీసీ.. షెడ్యూల్ 9 కిందకు వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నా.. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజనకు చాలా సమయం పడుతుందని.. అప్పటివరకు ప్రజలకు అసౌకర్యం కలగవద్దనే ఉద్దేశంతోనే టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు ఆర్థికశాఖ కార్యదర్శి కోర్టుకు వివరించారు.
దీనిపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉండగానే కొత్త సంస్థను ఎలా ఏర్పాటుచేస్తారని, విభజన జరగకుండానే ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ ఇస్తుందని ప్రశ్నించింది. అసలు.. ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా? లేదా? అని సూటి ప్రశ్న వేసింది.
అంతకుముందు.. అధికారుల తీరుపై హైకోర్టు మండి పడింది. విచారణకు సీఎస్ జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరవ్వగా.. అధికారులిచ్చిన నివేదికలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న న్యాయస్థానం అభిప్రాయపడింది.