ఎలాంటి తీర్పు వస్తుందో : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ

  • Published By: madhu ,Published On : October 28, 2019 / 08:45 AM IST
ఎలాంటి తీర్పు వస్తుందో : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ

Updated On : October 28, 2019 / 8:45 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పును చెబుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీపై దాఖలైన మూడు పిటిషన్లపై కోర్టు విచారించనుంది. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ప్రభుత్వం, కార్మికుల తరపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. చర్చల సారాంశాన్ని కోర్టుకు వివరించనుంది ప్రభుత్వం.

ఇటీవలే జరిగిన చర్చల వీడియో ఫుటేజీని కోర్టుకు ఇవ్వనుంది. అధికారుల తీరును కోర్టుకు వివరించనున్నాయి కార్మిక సంఘాలు. గతంలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 26 డిమాండ్లపై చర్చించాలని అటు కార్మికులు..కాదు. కేవలం 21 అంశాలపై చర్చిస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. సునీల్ శర్మ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఇదే నివేదికను కోర్టుకు సమర్పించనుంది ప్రభుత్వం. 

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుండి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కార్మికులు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఖరితో తీవ్ర మనస్థాపానికి గురై కొంతమంది కార్మికులు మృతి చెందగా..కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా తిరుగుతున్న బస్సులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 
Read More : హబ్సీగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం