Hyderabad : ఇది విన్నారా.. జాకెట్ సరిగా కుట్టనందుకు రూ.లక్ష జరిమానా.. ఇక జాగ్రత్తగా ఉండండి
Hyderabad : జాకెట్ సరిగా కుట్టనందుకు రూ.లక్ష జరిమానా విధించారు.
hyderabad consumer forum issues rs 1 lakh fine for improper stitching blouse
Hyderabad : సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే.. నిబంధనలు పట్టించుకోకుండా హద్దు మీరితే జరిమానా విధిస్తారనే సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాకెట్టు సరిగా కుట్టనందుకు ఓ సంస్థకు ఏకంగా రూ. లక్ష జరిమానా విధించారు. దీనితో పాటు రూ. 10 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముషీరాబాద్, గాంధీనగర్‌కు చెందిన కె. అమృత వర్షిణి అనే మహిళకు ఆమె సోదరుడి పెళ్లిలో పెళ్లి ఆడపడుచుకు బహుమతిగా కంచి పట్టుచీర వచ్చింది. దానికి తగ్గట్టుగా జాకెట్ కుట్టించడానికి గాను.. బ్లౌజ్ మెటీరియల్‌తోపాటు స్టిచింగ్ కోసం 2025 జనవరి 25న బంజారాహిల్స్‌లోని ‘బీ డిజైన్ ఫర్ యూ’ అనే దుకాణానికి వెళ్లారు. ఫిబ్రవరి 12 సాయంత్రంలోగా జాకెట్ కుట్టి తనకు ఇవ్వాలని తెలిపారు. ఇందుకు గాను అడ్వాన్స్‌గా రూ. 2,500 చెల్లించారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 5న సదరు సంస్థ సిబ్బంది అమృత వర్షిణికి కాల్ చేసి… ‘‘బ్లౌజ్ మెటీరియల్‌ను తప్పుగా కట్ చేశాం, క్షమించండి’’ అని చెప్పారు. దీనితో ఆందోళనకు గురైన అమృత వర్షిణి పరిష్కారం గురించి సిబ్బందినే ప్రశ్నించారు. అందుకు సదరు సిబ్బంది తమ తప్పును ఎవరూ కనిపెట్టలేని విధంగా మగ్గం వర్క్ చేసి, రీజాయిన్ చేసి ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ చివరకు సదరు సంస్థ తమ హామీని నిలబెట్టుకోలేదు.
అమృత వర్షిణికి అందించిన జాకెట్టు పెళ్లికి ధరించలేని స్థితిలో ఉంది. దీనితో ఆవేదనకు గురైన ఆమె.. తనకు కొత్త చీర ఇవ్వాలని, లేదంటే దానికి బదులుగా ధర చెల్లించాలని సదరు కంపెనీని డిమాండ్ చేశారు. అమృత వర్షిణి డిమాండ్‌కు ఒప్పుకున్న కంపెనీ, చివరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆమె కాల్స్‌కు స్పందించలేదు. దీనితో ఆగ్రహించిన బాధితురాలు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. వాట్సప్ చాట్, ఫోటోలు, చీర, రసీదులను ఆధారాలుగా సమర్పించగా.. అమృత వర్షిణికి రూ. లక్ష జరిమానాతో పాటు కేసు ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని కమిషన్ తీర్పు వెల్లడించింది.
