రాష్ట్రానికి జగనే సీఎం కావాలి : ఎస్వీ కృష్ణారెడ్డి

హైదరాబాద్ : ఏపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగనే సీఎం కావాలని టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జగన్ కు రాష్ట్ర ప్రజలంతా అండగా నిలబడాలని కృష్ణారెడ్డి కోరారు. ప్రతి చిన్న విషయంపైనా జగన్ కు పూర్తి అవగాహన ఉందని చెప్పిన కృష్ణారెడ్డి.. విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమం తదితర అంశాల గురించి ఆలోచించే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనకు ఉందన్నారు. జగన్ చేస్తున్న ప్రతి పని తన మనసులో నాటుకుందని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ
జగన్ గురించి చెప్పాలని అనిపించి తాను మీడియా ముందుకు వచ్చానని.. ఆయన గురించి చెప్పకుంటే తప్పు చేసిన వాడిగా మిగులుతానన్న భావన కలిగిందని కృష్ణారెడ్డి అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా ఆలోచించేవారో, జగన్ కూడా అలానే ఆలోచిస్తున్నారని.. ప్రజల మేలుకోరే ఇటువంటి నాయకుడు అధికారంలోకి రావడం అవసరమని కృష్ణారెడ్డి చెప్పారు.
ప్రజలకు సేవ చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని నిర్మాత అచ్చిరెడ్డి చెప్పారు. ప్రజలకు కావాల్సిన పథకాలను వైఎస్ఆర్ తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లానే జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లారని అన్నారు. సినిమాపరంగా అందరూ ఒక్కటే అన్న అచ్చిరెడ్డి.. రాజకీయలు మాత్రం వ్యక్తిగతం అన్నారు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రులను టీఆర్ఎస్ బెదిరిస్తోంది అనే ఆరోపణలను అచ్చిరెడ్డి కొట్టిపారేశారు. టీఆర్ఎస్ ఎవరినీ భయపెట్టడం లేదు, ప్రలోభపెట్టడం లేదని స్పష్టం చేశారు.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం