TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థులకు గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మే 31 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే 14 లోపు నామినేషన్ దాఖలు చేయాల్సివుంది. జూన్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిలను ప్రకటించారు.
పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పార్టీ మారిన కొండా మురళీధర్ రావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి.. శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మహేందర్ రెడ్డి పోటీ చేశారు. ప్రజా కూటమి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఆయన పరాజయం చెందారు. ఎమ్మెల్సీ పదవి రేసులో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే కార్తీక్‌ని కాదని పట్నం మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు కేసీఆర్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను పరిశీలించారు గులాబీ బాస్. ప్రధానంగా రవీందర్ రావు పేరు ఖరారైందని ప్రచారం జరిగింది. చివరకు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.
నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుత్తా సుఖేందర్ రెడ్డిని పేరు ప్రధానంగా వినిపించింది. అనూహ్యంగా తేరా చిన్నపురెడ్డి పేరును ఫైనల్ చేశారు. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ పదవికి గుత్తా విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో తేరా చిన్నపురెడ్డి పరాజయం చెందారు.