డేటా లీక్ చేయటానికి సిగ్గుండాలి, ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని : కేటీఆర్

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 06:04 AM IST
డేటా లీక్ చేయటానికి సిగ్గుండాలి, ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని : కేటీఆర్

Updated On : March 4, 2019 / 6:04 AM IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి తప్పు, నేరం, దొంగతనం  చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని, తెలంగాణ పోలీసుల విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని, హైకోర్టుకి ఎందుకు వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రభుత్వ వెబ్‌సైట్లలో నిక్షిప్తంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని మీ పార్టీ తొత్తులకు అప్పగించకపోతే.. చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన వ్యక్తి.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతోందని, ఏపీ ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీకి చేరవేస్తోందని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ చేపట్టామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో కేసు నమోదైతే తెలంగాణ పోలీసులు కాకుండా ఎవరు విచారిస్తారని అడిగారు.
Also Read : ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

అమరావతిలో అమెరికా టూరిస్ట్ పర్సు పోతే అమరావతిలోనే కేసు నమోదు చేస్తారు. అమరావతి పోలీసులే విచారించాలి. అమెరికా టూరిస్ట్ కదా అని అమెరికా పోలీసులు వచ్చి విచారణ చేయరు  అంటూ ఏపీ వాదనపై కేటీఆర్ సెటైర్లు వేశారు. అడ్డంగా దొరికిన దొంగలు.. ఇలాగే అడ్డమైన గోల చేస్తారు అంటూ చంద్రబాబు, లోకేష్ వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణలో నివాసం ఉండే వ్యక్తి..  ఇక్కడ కంపెనీపైనే కంప్లయింట్ చేశారని.. తెలంగాణ పోలీసులే విచారించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నేరం తెలంగాణలో జరిగితే.. ఏపీ పోలీసులు ఎందుకు వచ్చారని కేటీఆర్ నిలదీశారు. ఏపీ  ప్రభుత్వం తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు చేరవేస్తున్నారనే ఫిర్యాదు తమకు అందిందన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు  ప్రభుత్వం ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి ఐటీ గ్రిడ్ సంస్థకు అందజేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల డేటా చోరీ చేసినందుకు చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఇదంతా  ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.

తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ జరుపుతున్నారని కేటీఆర్ చెప్పారు. టీడీపీకి ఐటీ సేవలు అందించే ఐటీ గ్రిడ్ కంపెనీలో డేటా దొంగతనం జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఆ ఆఫీస్‌కి పోలీసులు వెళ్లారని కేటీఆర్ చెప్పారు. ఏపీ ప్రజల డేటాను టీఆర్ఎస్ ప్రభుత్వం తస్కరించిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, మీ డేటాతో మా ప్రభుత్వానికి ఏం పని అని కేటీఆర్ ఎదురు దాడి చేశారు. చంద్రబాబుకి ప్రజల్లో పలుకుబడి తగ్గిపోయిందని, అందుకే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో జరగాల్సింది జరుగుతుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.
Also Read : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ