చుక్కలు చూపిస్తారా : తెలంగాణ గడ్డ నుంచే ఏపీ పాలిటిక్స్

హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు చేయాలంటే అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడే కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయొచ్చనే అర్థంలో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని కేసీఆర్ పలు మార్లు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ వేలు పెడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపాయి. చంద్రబాబు రాకవల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందనడం అపోహ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్‌కే ఓటువేయాలని ప్రజలు ముందే డిసైడ్ అయ్యారని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కంప్యూటర్లను కనిపెట్టిన చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు.
16 సీట్లు మావే:
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 16 సీట్లు మేమే గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరుగతుందన్నారు. కాంగ్రెస్ ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదని, వారికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూశాక కూడా మహాకూటమి ఇంకా ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం, ఓటరు నమోదుపై చురుగ్గా పని చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. పార్టీ గురించి ఏ నిర్ణయం అయినా కేసీఆరే నిర్ణయిస్తారని, ఆయన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం న్నారు. పార్టీ గురించి ఏ నిర్ణయం అయినా వారే నిర్ణయిస్తారని తెలిపారు.