గెట్ రెడీ : హైటెక్ సిటీకి ఈ నెలలోనే మెట్రో సర్వీసులు

  • Published By: chvmurthy ,Published On : February 11, 2019 / 03:13 AM IST
గెట్ రెడీ : హైటెక్ సిటీకి ఈ నెలలోనే మెట్రో సర్వీసులు

హైదరాబాద్ : నగరంలోని ఐటీ కారిడార్ హైటెక్ సిటీ వైపు కొద్దిరోజుల్లో మెట్రో రైల్ పరుగులు ప్రారంభం కానున్నాయి. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ ఎస్) అధికారులు ఫిబ్రవరి 17వ తేదీలోగా టెస్ట్ రన్ పూర్తి చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవం చేయటానికి మెట్రో రైలు అధికారులు తేదీని పరిశీలిస్తున్నారు.

అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న 8 స్టేషన్లు ఉన్నాయి. భద్రతా సిబ్బంది నియామకం కోసం మెట్రో రైల్ అధికారులు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను సంప్రదించారు. మధురానగర్, యూసుఫ్ గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ దగ్గర ఉన్న 8 స్టేషన్లలో భద్రత కోసం 112 మంది పురుషులు, 48 మంది మహిళా సిబ్బంది, 32 మంది సూపర్ వైజర్లను నియమించనున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్ల నిర్వహణలో ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక టెక్నాలజీ అయిన కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ)ని హైదరాబాద్ మెట్రో రైళ్లలో  వినియోగిస్తున్నారు. రెండు సంస్థలు భద్రత పరంగా ఇప్పటికే సంతృప్తిని వ్యక్తం చేసాయి.

హైటెక్ సిటీ రూట్ లోని ఎనిమిది స్టేషన్లలో మౌలిక సదుపాయాల పూర్తి కావొస్తున్నాయి. మెట్రో స్టేషన్ల దగ్గర ట్రాఫిక్ క్లియరెన్స్ కు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్న మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ -అమీర్ పేట మధ్య రోజూ లక్షా 75 వేలమంది ప్రయాణిస్తున్నారు. అమీర్ పేట-హైటెక్ సిటీ మధ్య సర్వీసులు ప్రారంభమైతే ఈసంఖ్య పెరిగనుంది. కనీసం 2 లక్షలకుపైనే వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.