ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

  • Published By: vamsi ,Published On : February 21, 2019 / 03:53 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ను నేడు విడుదల చేయబోతుంది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నది. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న ఉపసంహరణకు గడువు కాగా.. మార్చి 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజు సాయం త్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కోడ్ వర్తించదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌కుమార్ స్పష్టంచేశారు.

అలాగే రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈవో రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల తుదిజాబితా పూర్తి అయిందని అన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,994 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గంలో 22,487, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 20,585 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన మీడియాకు వివరించారు.