స్ట్రైక్‌కు సర్కార్ స్ట్రోక్ : ఆర్టీసీలో కొత్త నియామకాలు

  • Published By: madhu ,Published On : October 7, 2019 / 12:28 AM IST
స్ట్రైక్‌కు సర్కార్ స్ట్రోక్ : ఆర్టీసీలో కొత్త నియామకాలు

Updated On : October 7, 2019 / 12:28 AM IST

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సమ్మెకు దిగడాన్ని ఆయన తీవ్ర తప్పిదంగా భావించారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొనే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 1200 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపేది లేదన్నారు సీఎం కేసీఆర్.

అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై సీఎం కేసీఆర్..2019, అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.

అతికొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. కొత్తగా వచ్చే కార్మికులు ఏ యూనియన్‌లో.. చేరబోమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలన్నారు. కొత్త సిబ్బందికి.. ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులని… మిగతా సగం ఆర్టీసీవి ఉంటాయన్నారు. ఈ పద్ధతిలో చర్యలు చేపడితేనే బస్సులు బాగా నడుస్తాయని.. రెండు మూడేళ్లలోనే సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందన్నారు సీఎం. 

ఆర్టీసీ మనుగడకు.. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు కొన్ని చర్యలు తప్పవన్నారు. తక్షణ చర్యగా 2 వేల 5 వందల బస్సులను అద్దెకు.. తీసుకొని నడపాలని అధికారులను ఆదేశించారు సీఎం. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలన్నారు. ఆర్టీసీపై సంవత్సరానికి 1200 కోట్ల నష్టం, 5 వేల కోట్ల రుణభారం ఉందని గుర్తు చేశారు. పెరుగుతున్న డీజిల్ ధరలతో సంస్థ ఇబ్బందుల్లో ఉన్న టైంలో చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగారన్నారు.

అది కూడా.. పండుగ టైంలో.. సమ్మెకు దిగిన వారితో రాజీపడే సమస్యే లేదన్నారు కేసీఆర్. కేసీఆర్ సూచనలపై కూలంకషంగా చర్చించి.. నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తమ ప్రతిపాదనలను.. ఈ కమిటీ అక్టోబర్ 07వ తేదీ సోమవారం ప్రభుత్వానికి అందజేయనుంది.
Read More : ఆర్టీసీని ప్రైవేటు చేసే ప్రయత్నం – అశ్వత్ధామ రెడ్డి