తెలంగాణ బంద్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు

  • Published By: vamsi ,Published On : October 15, 2019 / 02:28 AM IST
తెలంగాణ బంద్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు

Updated On : October 15, 2019 / 2:28 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది జనసేన. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు ఇవ్వగా.. ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిన తరుణంలో.. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ లేఖను విడుదల చేసిన అధినేత పవన్ కళ్యాణ్ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ రాణిగంజ్‌లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం అన్న పవన్ కళ్యాణ్.. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగొద్దన్నారు.

48 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్న జనసేనాని ఆర్టీసీ కార్మికులకు జనసేన అండగా ఉంటుందని అన్నారు. 

ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలన్నారు. సమ్మె జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.