పంచాయతీ ఓట్ల సమరం ముగిసింది

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ సమరం పోలింగ్ ముగిసింది. జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం సమయం పూర్తయిన తరువాత అధికారులు పోలింగ్‌ని ఆపేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 2 గంటల నుండి పోలైన ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. మొదటగా వార్డు సభ్యుల ఓట్లు..అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. పూర్తి ఫలితాలు రావడానికి సాయంత్రం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మూడో విడతలో మొత్తం 4వేల 116 గ్రామాల్లో ఎన్నికలు జరగాలి. అయితే 577 పంచాయతీలు ఏకగ్రీవం కావడం..10 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. అంతేగాకుండా రిజర్వేషన్ల కారణంగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. జనవరి 30వ తేదీ బుధవారం 3 వేల 504 గ్రామాల్లో పోలింగ్ జరిగింది.
* తుది విడతలో 4,116 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్
* రాష్ట్ర వ్యాప్తంగా 577 పంచాయతీలు ఏకగ్రీవం
* పది గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు
* సర్పంచ్ పదవులకు 11,667 మంది పోటీ
* మొత్తం 36,729 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్
* రాష్ట్ర వ్యాప్తంగా 8,959 వార్డులు ఏకగ్రీవం
* 186 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు
* 27,582 వార్డులకు పోలింగ్
* వార్డు సభ్యుల పదవులకు మొత్తం 73,976 మంది పోటీ