తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్క ఆంధ్రా కుటుంబాన్ని చూపించు : పవన్‌కు పోసాని సవాల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, బెదిరిస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవన్ ను ప్రశ్నిచారు. తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్కరినైనా చూపించగలవా అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినైనా కేసీఆర్ కొట్టారు అని నిరూపించగలవా అని పవన్ కు పోసాని సవాల్ విసిరారు. ఆంధ్రావాళ్ల భూములను కేసీఆర్ లాక్కున్నట్లు చూపిస్తే పవన్ కళ్యాణ్ కి పాదాభివందనం చేస్తానని పోసాని అన్నారు.
Read Also : కాంగ్రెస్ సంచలన నిర్ణయం : కేరళ నుంచి రాహుల్ పోటీ
కేసీఆర్.. ఎవరిని బెదిరించి వైసీపీలోకి పంపించారో కూడా స్పష్టం చెయ్యాలని పోసాని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోసాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు వలలో పడ్డారని ఆరోపించారు. పార్టీ పెట్టినప్పుడు నేను కమర్షియల్ రాజకీయ నాయకుడిని కాదు అని పవన్ అన్నారని పోసాని గుర్తు చేశారు. ఒకప్పుడు కేసీఆర్ ను విమర్శిస్తూ వ్యాసాలురాశానని, వాటిని చూసి కేసీఆర్ నవ్వుకున్నారే తప్ప తనను ఏమీ అనలేదని పోసాని చెప్పారు.
ఎన్టీఆర్ ను చంపింది చంద్రబాబే అని నీకు తెలిసా? అని పవన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయారని అందరికీ తెలుసు అన్నారు. ఆంధ్రాలో.. ఆంధ్రావాళ్లే క్షేమంగా ఉన్నారా? అని పోసాని అడిగారు. ఆంధ్రా ఆడపడుచు వనజాక్షిని కొట్టింది టీడీపీ నేతలే అని గుర్తు చేశారు. జగన్ ఎప్పుడైనా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారా? అని పోసాని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అని మండిపడిన పోసాని.. అలాంటి వ్యక్తుల వల్ల చాలా నష్టం కలుగుతుందన్నారు. తెలంగాణలో భూకబ్జాలు జరగడం లేదని పోసాని స్పష్టం చేశారు. పవన్ వక్రమైన మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ దుర్మార్గుడు అయితే ఆయనను ఎందుకు పొగిడావు.. ఆయన ఇంటికి ఎందుకు వెళ్లావు అని పవన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ నాటకాలను ప్రజలు గమనించాలని… ఓట్ల కోసమే వారిద్దరు తెలుగు ప్రజలను రెచ్చగొడుతున్నారని పోసాని ఆరోపించారు.
Read Also : అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్