క్యూనెట్ స్కామ్: అల్లు శిరీష్, పూజా హెగ్డేలకు నోటీసులు

మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’ కేసులో సినిమా ప్రముఖులకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన సైబరాబాద్ పోలీసులు పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. క్యూనెట్ ఫ్రాంచైజీ విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన 14 కేసుల్లో దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఈ సంస్థకు అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. నోటీసులు జారీ అయిన వారిలో శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్, సినీ రంగ ప్రముఖులు బొమన్ ఇరానీ, షారుక్ ఖాన్, అల్లు శిరీష్, పూజా హెగ్డేతో పాటు క్యూనెట్ కంపెనీ సీఈవోలు, డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, క్రికెటర్లు దాదాపు 500 మంది ఉన్నారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో వారిని పోలీసులు కోరినట్లు సమాచారం.
వీరంతా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాల విభాగ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉంది. బెంగళూరుకు చెందిన విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దాదాపు 3 లక్షల మందిని మోసగించినట్లుగా తెలుస్తుంది. రూ.10 వేల కోట్లకుపైగా మోసం జరిగినట్లు తెలుస్తుండగా విచారణ పూర్తయితే అందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనవరి తొలి వారంలో 14 కేసుల్లో 58 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆ కంపెనీకి చెందిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.2.7 కోట్లను ఫ్రీజ్ చేసింది.