కోలుకుంటున్న మధులిక : వెంటిలేటర్ తొలగించిన వైద్యులు
హైదరాబాద్ : ప్రేమోన్మాది భరత్ చేతిలో గాయపడి మలక్ పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్య పరిస్ధితిలో మెరుగుదల కనిపిస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిన్నటి తో పోల్చుకుంటే నేడు నిలకడగా ఉంది. వైద్యులు చేసిన 5 సర్జరీలతో ఆమె కోలుకుంటోంది. న్యూరో, స్పయిన్, అర్ధో, ప్లాస్టిక్ సర్జన్ల బృందం మధులికకు చికిత్స అందించారు. బ్రెయిన్ లో ఇరుక్కుపోయిన ఎముకను తొలగించారు. క్రమేపి ఆమె ఆరోగ్య పరిస్ధితి బాగుపడటంతో వైద్యులు శనివారం ఆమెకు వెంటిలేటర్ కూడా తొలగించారు.
ఇంకో 24 గంటల పాటు మధులిక ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ప్రకటిస్తామని డాక్టర్లు తెలిపారు. శరీరంలో ఇన్ఫెక్షన్ సోకకుండా, గాయాలు అయిన చోట వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మధులిక పూర్తిస్ధాయిలో కోలుకుంటుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె శరీరంలో సుమారు 15 చోట్ల ఆపరేషన్లు కూడా చేశారు.