పడిపోతున్న ఉష్ణోగ్రతలు : పెరిగిన చలి తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది.
నిన్న పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా నమోదయ్యాయి. దీంతో సాయంత్రం నుంచే చలితీవ్రత పెరిగింది. చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పల్లెల్లో తెల్లవారుజామున చలిమంటలు వేసుకుంటున్నారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
విశాఖ ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం(నవంబర్ 16, 2019) చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. చలి, మంచు కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాయంత్రం 5 గంటల నుంచే రోడ్లపై జనసంచారం తగ్గిపోతుంది. జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కాగా నవంబర్ ఆఖరికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.