తెలంగాణ అసెంబ్లీ : పద్మారావుపై సభ్యుల ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు పద్మరావుతో అనుబంధం, ఆయన గురించి ప్రస్తావించారు. పద్మరావుపై సభ్యులు ప్రశంసల జల్లు కురిపించారు.
మల్లు భట్టి విక్రమార్క : సభా అధ్యక్షుడిగా తీసుకొనే నిర్ణయాలు అందరూ అంగీకరించే విధంగా సభ నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్మిక నాయకుడిగా పేదల కోసం నిరంతరం తపించే వ్యక్తి పద్మరావు అని తెలిపారు. 1970లో ఇందిరాగాంధీ పీఎం ఉన్న సమయంలో గరీబ్ హాఠావో పిలుపు మేరకు పద్మరావు పేదల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా వారి జీవితాల్లో వెలుగులు నింపారని, హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆనాడు ఉమ్మడి సభలో డిప్యూటీ స్పీకర్‌గా తాను కూడా పనిచేయడం జరిగిందన్నారు.
మహమూద్ ఆలీ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావుకు ఎనలేని పేరు ఉందని పేదల పక్షాన నిలబడుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పద్మారావు పాత్ర కీలకమన్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రజా సమస్యలు వినే నాయకుడు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
రాజా సింగ్ : ఒక మంత్రిగా ఉన్నా ప్రజలతో నిత్యం ఉండడం కొంతమంది వల్లే సాధ్యమౌతుందని, పద్మారావు కూడా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తి అని తెలిపారు. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమయం కేటాయించే విధంగా చూడాలని వేడుకున్నారు.
కేటీఆర్ : నిబద్ధతతో, కార్యదక్షతతో పనిచేస్తూ పదవులకు అలంకారం తీసుకొచ్చారని, డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా వన్నె తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దశాబ్ద కాలానికి పైగా పద్మారావుతో కలిసి పని చేసే అవకాశం దక్కిందన్నారు. మరిన్ని పదవులు అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
హరీశ్ రావు : ఉద్యమ సహచరుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా కలిసి పని చేసే అవకాశం తనకు దక్కిందని హరీష్ రావు పేర్కొన్నారు. పజ్జన్న అని గౌరవంగా..ఇష్టంగా పిలుచుకుంటారని, అప్యాయితతో, ప్రేమతో పనిచేశారని కొనియాడారు. జై తెలంగాణ పద్మారావు అంటే సభ దద్దరిల్లేదన్నారు. కల్లు దుకాణాలను తెరిపించడంతో పాటు చెట్ల రకాన్ని రద్దు చేసిన ఘనత పద్మారావుకు దక్కిందన్నారు. గుడుంబా మహమ్మారిని తరిమికొట్టడం గొప్ప విషయమన్నారు.
తలసాని శ్రీనివాస యాదవ్ : జంటనగరాల్లో ఉద్యమ నాయకుడిగా ఉంటూ ఎన్నో కేసులు పద్మారావు ఎదుర్కొన్నారని తెలిపారు. 2004లో ఎన్నికల్లో పద్మారావు గెలిస్తే తాను పరాజయం కావడం..అనంతరం తాను గెలవడం..పద్మారావు ఓటమి చెందడమే తప్పా…ఎలాంటి విరోధం లేదన్నారు. మిగతా సభ్యులు కూడా మాట్లాడారు. మిగతా వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.